ఇండోర్‌లోనూ సూరత్‌ వ్యూహం?.. నామినేషన్‌ ఉపసంహరణకు ఒత్తిడి

ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సూరత్‌లో తన అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకున్న బీజేపీ.. ఇండోర్‌లోనూ అదే వ్యూహం

  • Publish Date - May 3, 2024 / 08:12 PM IST

  • ఎస్‌యూసీఐ అభ్యర్థికి బెదిరింపులు
  • నామినేషన్‌ ఉపసంహరణకు యత్నాలు
  • గట్టిగా నిలబడిన ఎస్‌యూసీఐ శ్రేణులు
  • ఒత్తిళ్లకు లొంగని అభ్యర్థి అజిత్‌సింగ్‌ పన్వర్‌

ఇండోర్‌: ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సూరత్‌లో తన అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకున్న బీజేపీ.. ఇండోర్‌లోనూ అదే వ్యూహం పన్నిందని, కానీ.. ఒక వామపక్ష పార్టీ అభ్యర్థి అందుకు నిరాకరించడంతో అది పారలేదని అంటున్నారు. సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దాఖలు చేసిన రెండు సెట్ల నామినేషన్లు, ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యాయి. బరిలో నిలిచిన మిగిలిన అభ్యర్థులందరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఆ సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్నది. ఇండోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయారు. అయితే.. ఇండోర్‌లో బరిలో నిలిచిన ఇతర పార్టీల అభ్యర్థులకు పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సోషలిస్ట్‌ యునిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్ట్‌) అభ్యర్థి అజిత్‌ సింగ్‌ పన్వర్‌ ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు, బీజేపీ ప్రతినిధులుగా చెప్పుకొంటున్న పలువురు వ్యక్తుల నుంచి వందల మిస్డ్‌కాల్స్‌ వచ్చాయని అంటున్నారు. అభ్యర్థులను నియంత్రించే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునేందుకు సోషలిస్ట్‌ యునిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్ట్‌)ను కొందరు వ్యక్తులు, బెదిరించి, భయపెట్టి, బుజ్జగించి రంగంలో లేకుండా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ నుంచి శంకర్‌ లాల్‌వాని పోటీ చేస్తున్నారు.

అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన ఏప్రిల్‌ 29కి ముందు రెండు రోజుల పాటు తనను పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఫోన్లు చేసి బెదిరించారని ఆయన ఒక వెబ్‌సైట్‌కు చెప్పారు. ఒక ముఖ్యమైన అంశంపై చర్చించేందుకు తనను కలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కోరుతున్నారని ఒక న్యాయవాది తనకు ఫోన్‌ చేశారని ఆయన తెలిపారు. తాను తిరస్కరించడంతో తన సొంత ప్రాంతమైన గుణ నుంచి ఒక పోలీసు అధికారి ఫోన్‌ చేశారని, ఇండోర్‌ నగర అభివృద్ధి విషయంలో చర్చించేందుకు కొందరు బీజేపీ ఉన్నతస్థాయి నేతలు చెప్పారని తెలిపారని పేర్కొన్నారు. దాంతో సూరత్‌ తరహాలోనే ఇండోర్‌లో కూడా వ్యూహం ఏదో పన్నుతున్నరని తనకు అర్థమైందని పన్వర్‌ చెప్పారు. ఆ తర్వాత కూడా చాలా మంది ఫోన్‌ చేశారని, తాను తిరస్కరించానని తెలిపారు. తాను ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు తన నామినేషన్‌ను ప్రతిపాదించిన ఎస్‌యూసీఐ నేత వద్దకు వెళ్లి.. పన్వర్‌ను తాను బలపర్చలేదని కలెక్టరేట్‌కు వచ్చి చెప్పాలని కోరారని చెప్పారు. బీజేపీకి ఇండోర్‌ సీటు భద్రమైనదే అయినప్పటికీ.. ఆ పార్టీ నేతలు ఇటువంటి కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని పన్వర్‌ ఆరోపించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కానీ ఈ ఫోన్లు ఆగలేదని చెప్పారు. అయితే.. బీజేపీ నాయకులు బరిలో ఉన్న 13 మంది ఇండిపెండెంట్లతో మాట్లాడారని తనకు సమాచారం ఉన్నదని, తాను తిరస్కరించడంతో వారు తమ ప్లాన్‌ మార్చుకుని వారు కొనసాగేందుకు సమ్మతించారని పన్వర్‌ తెలిపారు.

ఎస్‌యూసీఐ (కమ్యూనిస్ట్‌) మధ్యప్రదేశ్‌లో ఆరు సీట్లలో పోటీ చేస్తున్నది. తమ కార్యకర్తలను సంప్రదించేందుకు అనేక మంది ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో ప్రయత్నించారని, తొలుత తమకు అర్థం కానప్పటికీ.. కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణ, బీజేపీలో చేరికతో అసలు కుట్ర అర్థం చేసుకున్నామని ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సునీల్‌ గోపాల్ తెలిపారు. ఇప్పుడు ఇండోర్‌లో తామే బీజేపీపై పోటీ చేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ ఎస్‌యూసీఏ అని, మిగిలినవారంతా ఇండిపెండెంట్లేనని చెప్పారు. తాము బీజేపీని ఇప్పుడు నేరుగా ఢీకొంటామని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ పార్టీ బలంగా నిలబడిందని, కిందిస్థాయి కార్యకర్త కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని చెప్పారు. ఎన్నికల బరిలోనూ ఇదే సంకల్పంతో పోరాటం చేస్తామని, 2024, మే 13న ఇండోర్‌ ఎన్నికలను చూస్తుందని అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను ఒత్తిడి చేసిన అంశంలో తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్టు సునీల్‌ గోపాల్‌ తెలిపారు.

Latest News