Bottle Gourd | భోపాల్ : యువకుడి కడుపులో రెండు అడుగుల సొరకాయ( Bottle Gourd ) ఉండటం ఏంటని అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే. ఆ యువకుడి కడుపులో ఉన్న సొరకాయను చూసి వైద్యులే షాక్ అయ్యారు. అంతేకాదు ఆ సొరకాయ ప్రభావంతో పెద్ద పేగు నలిగిపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ సొరకాయ మల ద్వారం నుంచి శరీరంలోకి చొప్పించబడిందని వైద్యులు నిర్ధారించారు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్‌కు వెళ్లక తప్పదు.
మధ్యప్రదేశ్( Madhya Pradesh ) ఛతర్‌పుర్ జిల్లాలోని ఖజురహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే తీయగా కడుపులో సొరకాయ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధిత యువకుడిని శనివారం సర్జరీ నిర్వహించారు. కడుపులో ఉన్న రెండు అడుగుల సొరకాయను బయటకు తీశారు. సొరకాయకు తొడిమ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సొరకాయ కారణంగా యువకుడి కడుపులో ఉన్న పెద్ద పేగు నలిగిపోయిందని డాక్టర్లు పేర్కొన్నారు. సొరకాయ అతడి శరీరంలోకి మలద్వారం ద్వారా వచ్చిందని చెప్పారు. ఎవరైనా బలవంతంగా చొప్పించారా అన్న విషయం తెలియాల్సి ఉందని అన్నారు. బాధితుడు కూడా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది.