Site icon vidhaatha

Census । ఎట్టకేలకు జనాభా లెక్కల సేకరణ.. ప్రారంభం, ముగింపు వివరాలివే..

Census । కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల సేకరణ(Census)కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధం అవుతున్నది. ఈ జనాభా లెక్కల సేకరణతోపాటే కుల గణన (caste enumeration) నిర్వహిస్తారా? అనే అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ప్రతిపక్ష ఇండియా కూటమితోపాటు.. అధికార ఎన్డీయే కూటమిలో సైతం కుల గణన డిమాండ్లు ఉన్న నేపథ్యంలో దీనిపై కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. 2025లో జనాభా లెక్కల సేకరణ చేపట్టి, 2026 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. జనాభా లెక్కల సేకరణ అనంతరం కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (delimitation) చేపట్టనున్నది. దీనితోపాటు మహిళా రిజర్వేషన్లు (women’s reservation) కూడా అమల్లోకి రానున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలను కొత్త నియోజకవర్గాల వారీగా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రెండింటికీ జనాభా లెక్కల సేకరణ అత్యంత ముఖ్యమైనది. 2002లో 84వ రాజ్యాంగ సవరణను (84th Amendment) నాటి అటల్‌ బిహారి వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకురావడంతో నియోజకవర్గాల పునర్విభజనలో 25 ఏళ్లపాటు జాప్యం నెలకొన్నది. 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల సేకరణ ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని నాటి సర్కార్‌ పేర్కొన్నది. ఆ మేరకు 2031 జనాభా లెక్కల సేకరణ అనంతరం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉన్నది. అయితే.. 2025 నాటికి జనాభా లెక్కల సేకరణను చేపట్టి, ఏడాదిలో ఆ ప్రక్రియను పూర్తి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని తెలుస్తున్నది. అలాగైతేనే 2029 లోక్‌సభ ఎన్నికలను కొత్త నియోజకవర్గాల ఆధారంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా (Registrar General and Census Commissioner of India ) మృత్యుంజయ్‌ కుమార్‌ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియాల్సి ఉన్నది. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని 2026 ఆగస్ట్‌ వరకూ ఇటీవలే పొడిగించింది.

ఈసారి చేపట్టే జనాభా లెక్కల సేకరణలో కుల గణనను కూడా చేపట్టాలని కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు (Congress and allies)  డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాలైన JD(U), లోక్‌ జనశక్తి పార్టీ, అప్నాదళ్‌ వంటి పార్టీలు కూడా కుల గణన నిర్వహించాలని కోరుతున్నాయి. అయినా ఇప్పటి వరకూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తున్నది. బీజేపీ మాతృసంస్థ అయిన RSS సైతం కుల గణన అంశానికి మద్దతు పలుకుతున్నది. తగిన లెక్కలు ఉండటం మంచి సంప్రదాయమేనని పేర్కొంటున్నది.
కేంద్రం తల్చుకుంటే కుల గణన అనేది పెద్ద అంశమే కాదు. ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీల్లో లెక్కలు తీస్తున్నారు. దీనికి ఓబీసీ(OBC category )తోపాటు జనరల్‌, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీల్లో సబ్‌ సెక్షన్లను పొందుపరిస్తే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నియోజకర్గాల పునర్విభజన విషయంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి పార్లమెంటులో తమ రాజకీయ వాటా(political share )ను రాబోయే పునర్విభజన తీవ్రంగా ప్రభావితం చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్న చర్యల ఫలితంగా జనాభా పెరుగుదల సదరు రాష్ట్రాల్లో నియంత్రణలో ఉన్నది. కానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం జనాభా ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజిస్తే.. దక్షిణాదికి తక్కువ సీట్లు, ఉత్తరాదికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రగతి కోసం తాము తీసుకున్న నిర్ణయాలు, ప్రజలను చైతన్యం చేసిన కార్యక్రమాలు అంతిమంగా తమ రాష్ట్రాల రాజకీయ అవకాశాలను ప్రభావితం చేస్తాయంటే దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ విషయంలో తమ ఆందోళనలను వివిధ దక్షిణాది రాష్ట్రాలు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నాయి. మరింత మంది పిల్లలను కనాలని ఇటీవల Andhra Pradesh  ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామ్యపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సైతం పిలుపునివ్వడం గమనార్హం.

అయితే, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు తమ దృష్టిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణ (population control ), ఇతర సామాజిక అభివృద్ధిలో గణనీయ ప్రగతిని సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసే ఎలాంటి చర్యలూ ఉండబోవన్న అభిప్రాయాన్ని మాత్రం ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 81వ అధికరణానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ అధికరణం లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్వచిస్తున్నది. దీనితోపాటే ఆర్టికల్‌ 170 (అసెంబ్లీ సీట్ల కూర్పు), 82, 55 అధికరణలు (రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్‌ కాలేజీ(electoral college )లో ఓట్ల విలువను నిర్ణయించేది), లోక్‌సభ, అసెంబ్లీల్లో నియోజకవర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన 330, 332 అధికరణాలను కూడా సవరించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

 

Exit mobile version