Chhattisgarh HC Ruling | చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఒకరి ఫోన్ ఒకరు వాడుతూనే ఉంటారు. భర్త బ్యాంక్ ఖాతాలను భార్య, భార్య బ్యాంక్ ఖాతాను భర్త ఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవల ఆసక్తికర తీర్పును వెలువరించింది. ఒక భర్త హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 (1) (ia-a) ప్రకారం క్రూరత్వం కింద విడాకుల పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా భర్త.. తన భార్య ఫోన్ కాల్ డిటెయిల్స్ ఇప్పించాలని కోరాడు. ఆమె చెడు ప్రవర్తనను రుజువు చేసేందుకు కాల్ డిటెయిల్స్ ఇవ్వాలని కోరాడు. అయితే.. దిగువ కోర్టు ఆ వినతిని తిరస్కరించింది. తన భార్య ఆమె బావమరిదితో అక్రమ సంబంధం కలిగి ఉందని భర్త అనుమానం. అయితే.. తన ఆరోపణలను రుజువు చేసేందుకు కాల్ డిటెయిల్స్ ఎలా ఉపయోగపడతాయన్న విషయాన్ని కోర్టుకు వివరించలేక పోయాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సవాలు చేశాడు.
ఈ కేసు విచారించిన హైకోర్టు.. విడాకులు క్రూరత్వం ప్రాతిపదికన మంజూరు చేయవచ్చు కానీ.. అక్రమ సంబంధాల ఆధారంగా కాదని పేర్కొన్నది. ఇక కాల్ డిటెయిల్స్ విషయంలో.. అవి కోరడం రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ఆంతరంగిక గోప్యత హక్కు ఉల్లంఘనకు కారణమవుతుందని పేర్కొన్నది. పెళ్లియినంత మాత్రాన భార్యకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంపై భర్తకు దానంతట అదే హక్కుగా రాబోదని కోర్టు తేల్చి చెప్పింది. బ్యాంక్, మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్స్ వంటి వ్యక్తిగత సమాచారాలు ఇవ్వాలని భార్యను భర్త ఒత్తిడి చేయజాలరని స్పష్టం చేసింది. అలా ఒత్తిడి చేయడం సంబంధిత పరిణామాల ఆధారంగా గృహహింస కిందకు వస్తాయని పేర్కొన్నది. వ్యక్తిగత సమాచారం కోసం ఒత్తిడి చేయడం ఆమె ఆంతరంగిక గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్ రాకేశ్ మోహన్ పాండే ఏకసభ్య ధర్మాసనం పేర్కొన్నది.