విధాత: రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ (BJP) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకోవాలని రెండు పార్టీలూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అందుకోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కృషి చేస్తున్న కాంగ్రెస్.. బీజేపీ కెప్టెన్ పైకి రామబాణాన్ని వదిలింది.
ప్రస్తుత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) పైకి పోటీగా ప్రసిద్ధ నటుడు, హనుమాన్ వేషధారణలో టెలివిజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విక్రమ్ మస్తల్‌ను పోటీకి నిలబెట్టింది. 2008లో ప్రసారమైన ఆనంద్ సాగర్ దర్శకత్వంలోని రామాయణంలో విక్రమ్.. హనుమ పాత్రను పోషించారు. ఈ వేషంతో ఆయనకు విశేష ప్రజాదరణ రాగా.. దానిని ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌తో పాటు ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ తన అడ్డా అయిన చింద్వారా నుంచి పోటీ చేయనున్నారు. మరో అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్ధన్ సొంగ్.. రాఘీగాత్ సీటు నుంచి బరిలో నిలవనున్నారు.
ప్రస్తుతం సీఎంగా ఉన్న శివరాజ్‌సింగ్ చౌహాన్ బీజేపీ తరఫున తన సొంత నియోజకవర్గం బుధినీ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయనకు ప్రత్యర్థిగా హనుమగా నటించిన విక్రమ్‌ను కాంగ్రెస్ బరిలోకి నిలబెడుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో 47 మంది జనరల్ కేటగిరీ, 39 మంది ఓబీసీ అభ్యర్థులు, 22 మంది ఎస్సీ కేటగిరీ, 30 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులతో పాటు ఒక ముస్లిం, 19 మంది మహిళలు ఉన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే 230 సీట్లకు గానూ 136 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ నవంబర్ 17న ఎన్నికలు జరగనుండా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.