ఎనిమిది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు స్థానాలతో ఊరట!

8 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2 స్థానాలు సాధించి కొంత ఊరట పొందింది. తెలంగాణ, రాజస్థాన్‌లో గెలిచి బీజేపీతో పాటు ఇతర పార్టీలతో పోటీగా నిలిచింది.

Congress

న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన 8 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2, బీజేపీకీ 2 అసెంబ్లీ స్థానాలు దక్కడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితపై విజయం సాధించారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ భాయా 15,612ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ జైన్ భాయాకు 69,751ఓట్లు పోలవ్వగా, అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి ఎం. సుమన్ కు 53,959 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి నరేష్ మీనాకు 53,800ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఇండిపెండెంట్ అభ్యర్థి భారీగాఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ గెలుపు సులభమైంది.

అయితే ఒరిస్సాలో అధికార బీజేపీ నుపధ నియోజకవర్గంలో భారీ ఆధిక్యతలో ఉంది. బీజేపీ అభ్యర్థి జై దోలకియ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి గాసీరామ్ మాఝీ పై 83,748ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న బిజూ జనతాదళ్ అభ్యర్థి స్నేహంగాని చూరియాకు 38,404ఓట్లు పోలయ్యాయి.

అలాగే జమ్మూ కశ్మీర్ లో నాగ్రోటా నియోజకవర్గంలోనూ బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా సమీప ప్రత్యర్థి జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షదేవ్ సింగ్ పై 24,647ఓట్ల తేడాతో గెలుపొందారు. జమ్మూకశ్మీర్ లోని బుద్గామ్ నియోజకవర్గంలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆగా సయీద్ ముంతాజీర్ మెహథీ తన సమీప ప్రత్యర్థి జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్పరెన్స్ అభ్యర్థి ఆగా సయీద్ మహ్మద్ అలా మోసావీపై 4,478ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మూడో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి జిబ్రాధార్ కు 7,152ఓట్ల పోలయ్యాయి.
పంజాబ్ లో ని థార్న్ థరన్ నియోజకవర్గంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధూ సమీప శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ పై 12,091ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మూడో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్ధి మణిదీస్ సింగ్ కాస్లాకు 19,620ఓట్లు రావడం గమనార్హం.

జార్ఖండ్ రాష్ట్రంలోని ఘట్సీలా నియోజకవర్గంలో అధికార జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ తన సమీప ప్రత్యర్థి బాబులాల్ సోరెన్ పై 32,805ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

మీజోరామ్ లో ధంపా నియోజకవర్గంలో మీజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్.లాల్ తంగ్లీయాన తన సమీప ప్రత్యర్థి జరోమ్ పీపుల్ మూమెంట్ అభ్యర్థి వనలాల్ శైలోవాపై 562ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జాన్ రోత్లింగానియాకు 2394ఓట్లు పోలయ్యాయి.