Site icon vidhaatha

Rahul Gandhi | ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం.. ఇది నా గ్యారంటీ : రాహుల్‌గాంధీ

Rahul Gandhi : ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఇది రాహుల్‌గాంధీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. తనను తాను నిజమైన దేశభక్తుడిగా ప్రకటించుకుంటున్న ప్రధాని మోదీ (PM Modi).. అగ్నిపథ్‌ పథకంతో జవాన్‌లను అవమానించారని ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని పాలిగంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. దేశం కోసం భగవంతుడు తనను ఇక్కడికి పంపించాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై రాహుల్‌ మండిపడ్డారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, తానొక నిజమైన దేశభక్తుడిని అంటూ ప్రజలను మాయచేస్తున్నారని మండిపడ్డారు.

అగ్నివీర్‌ పథకాన్ని అమలుచేసి సైనికులను ప్రధాని ఘోరంగా అవమానించారని, ఆయన మళ్లీ ప్రధాని కావడం కష్టమేనని, ఇది రాహుల్‌ గ్యారంటీ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కాషాయ పార్టీ పన్నుతున్న కుట్రను అడ్డుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా తమ కూటమికి ప్రజాదరణ లభిస్తోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్‌ పథకాన్ని తొలగిస్తామని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, నెలనెలా ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో రూ.8,500 జమ చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

Exit mobile version