D Srinivas | కాంగ్రెస్‌ హైకమాండ్‌కు విధేయుడిగా డీఎస్‌.. వివాదరహిత రాజకీయ జీవితం..

D Srinivas | డీఎస్‌ పేరుతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్‌ (Dharmapuri Srinivas) పూర్తిగా వివాదరహితుడు. ఆయన రాజకీయ జీవితం పూర్తిగా వివాదరహితంగానే సాగింది. పైగా విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో చేరిన డీఎస్‌.. జీవితాంతం ఆ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ పెద్దలకు, ముఖ్యంగా గాంధీల కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నారు. వర్గ రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దాంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌లో డీఎస్‌ అంటే గుర్తుపట్టని వారంటూ లేని స్థాయికి ఎదిగారు.

  • Publish Date - June 29, 2024 / 09:45 AM IST

D Srinivas : డీఎస్‌ పేరుతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్‌ (Dharmapuri Srinivas) పూర్తిగా వివాదరహితుడు. ఆయన రాజకీయ జీవితం పూర్తిగా వివాదరహితంగానే సాగింది. పైగా విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో చేరిన డీఎస్‌.. జీవితాంతం ఆ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ పెద్దలకు, ముఖ్యంగా గాంధీల కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నారు. వర్గ రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దాంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌లో డీఎస్‌ అంటే గుర్తుపట్టని వారంటూ లేని స్థాయికి ఎదిగారు. డీఎస్‌ పేరు వింటే కాంగ్రెస్‌ పెద్దలకు ఎవరికైనా ఆయన టక్కున గుర్తుకొచ్చేవారు.

పార్టీలో అంత పేరు సంపాదించిన డీఎస్‌.. చివరి దశలో అంటే 2015లో అప్పటి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ కారణంగా పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది మార్చిలో తిరిగి సొంతగూటికి చేరారు. ఆఖరికి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పార్టీలోనే తన జీవిత ప్రస్థానాన్ని ముగించారు. నిజామాబాద్‌ జిల్లాలో 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీ శ్రీనివాస్‌.. విద్యార్థిగా నాయకుడిగా ఎన్‌ఎస్‌యూఐ (NSUI) లో చేరి ఒకానొక దశలో రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు.

సామాన్య కార్యకర్తగా మొదలై ఎమ్మెల్యేగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో మొదటిసారి నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీలో చురుగ్గా పనిచేస్తూ పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. పీసీసీ చీఫ్‌ హోదాలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించి ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచారు. కానీ చివరికి ఆ పదవి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి దక్కింది. ముఖ్యమంత్రి పదవిని ఆశించినా సోనియాగాంధీ నచ్చజెప్పడంతో హైకమాండ్‌ నిర్ణయాన్ని ఆయన గౌరవించారు. కాంగ్రెస్‌ పెద్దలపట్ల తన విధేయతను చాటుకున్నారు.

ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఎలాంటి విభేదాలు లేకుండా మంత్రివర్గంలో చేరారు. పార్టీకి తామిద్దరం ఇప్పుడు జోడెడ్ల లాంటి వాళ్లం అంటూ కలిసి పనిచేశారు. 2009లో కూడా కాంగ్రెస్ విజయంలో డీఎస్‌ కీలకపాత్ర పోషించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండో టర్మ్‌లో కూడా మంత్రిగా పనిచేశారు. ఒక దఫా రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఐ అండ్ పీఆర్ మంత్రిగా.. మరో దఫా ఉన్నత విద్య, అర్బన్ లాండ్‌ సీలింగ్ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వెంట నడిచారు. దాంతో కాంగ్రెస్‌ బలం తగ్గిపోయింది.

ఈ క్రమంలో 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన డీఎస్‌కు అప్పటి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అడ్డుతగిలారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పెద్దలతో ఉన్న సత్సంబంధాలు కూడా ఆయనకు అక్కెరకు రాలేదు. ఈ సందర్భంగా ఆయన.. ‘మా పార్టీలో విధేయులకు స్థానం లేదనే విషయం స్పష్టంగా అర్థమయ్యింది. కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది పెద్దలకు నా లాంటి వాళ్ళంటే ఇష్టం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, వివాదరహితంగా, ప్రతిఒక్కరితో సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్లడం కొందరు పెద్దలకు నచ్చట్లేదని.. తనకు శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ టికెట్ రాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని డీఎస్ తన సన్నిహితులు, అనుచరుల దగ్గర వాపోయారు.

అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారు. 2023లో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి సొంత గూటికి చేరారు. అప్పటికే అనారోగ్య కారణాలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కాగా డీ శ్రీనివాస్‌ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉంది. 2023కు ముందు డీఎస్‌ బీఆర్‌ఎస్‌లో ఉంటే ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు కాంగ్రెస్‌లో, ఇంకొకరు బీజేపీలో ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. చిన్న కుమారుడు అరవింద్‌ ప్రస్తుతం నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు.

కాగా, గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న డీ శ్రీనివాస్‌ ఈ ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం మూడు గంటలకు తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Latest News