దేశవ్యాప్తంగా మహాలక్ష్మి పథకం.. పేద కుటుంబాలకు ఏటా లక్ష సాయం

  • Publish Date - April 5, 2024 / 05:46 PM IST

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు, 50శాతం పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ తెస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయ్‌ పత్ర్‌ పేరుతో శుక్రవారం మ్యానిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పీ చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ తదితరులు న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఇందులో ఐదు గ్యారెంటీలను ప్రముఖంగా పేర్కొన్నారు.

రాజస్థాన్‌ తరహాలో సార్వజనీన ఆరోగ్య సంరక్షణ కింద 25 లక్షల వరకూ నగదు రహిత బీమా సదుపాయం కల్పిస్తామని మ్యానిఫెస్టో ప్రకటించింది. అన్ని కులాలు, మతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేకుండా విద్య, ఉద్యోగాల్లో పదిశాతం కోటా కల్పిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మంజూరై, ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా ప్రతి యేటా ప్రకటించే కనీస మద్దతు ధరలకు లీగల్‌ గ్యారెంటీ ఇస్తామని తెలిపింది.

వివాదాస్పద అగ్నిపథ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసి, సాధారణ పద్ధతిలో సాయుధ దళాల్లోకి నేరుగా రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తామని పేర్కొన్నది. జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్రప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని, పట్టణ ఉద్యోగ కార్యక్రమం ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని తెలిపింది.

ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకించి ఉన్నత విద్యలో ఇచ్చే ఉపకార వేతనాలను రెట్టింపు చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు సహాయం అందిస్తామని తెలిపింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని 15(5) అధికరణం ఆధారంగా ఒక చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. బేషరతు నగదు బదిలీ కింద దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష రూపాయలను మహాలక్ష్మి పథకం కింద అందిస్తామని ప్రకటించింది.

సమానత్వం, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సమాఖ్య స్ఫూర్తి, జాతీయ భద్రత, పర్యావరణం వంటి అంశాలపై కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కేంద్రీకరించింది. రాజద్రోహ చట్టాన్ని ఎత్తివేస్తామని, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షిస్తామని తెలిపింది. ఘర్షణలు, విద్వేషపూరిత నేరాల కేసులలో నిర్లక్ష్యానికి పోలీసు, అధికారులను బాధ్యులను చేస్తామని తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. ఆధార్‌ వాడుకను నియంత్రిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని, ఇది 2025 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. కనీస వేతనం రోజుకు 400 రూపాయలు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని రద్దు చేసి, దాని స్థానంలో జీఎస్టీ 2 తీసుకొస్తామని తెలిపింది.

Latest News