40 ఏండ్ల త‌ర్వాత అల‌హాబాద్‌లో గెలిచిన కాంగ్రెస్.. నాటి చివ‌రి ఎంపీ అమితాబ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో 40 ఏండ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది

  • Publish Date - June 10, 2024 / 05:23 PM IST

హైద‌రాబాద్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో 40 ఏండ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ త‌ర‌పున గెలిచిన చివ‌రి ఎంపీ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అల‌హాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఉజ్వ‌ల్ ర‌మ‌ణ్ సింగ్ పోటీ చేశారు. బీజేపీ అభ్య‌ర్థి నీర‌జ్ త్రిపాఠిపై 58 వేల ఓట్ల మెజార్టీతో ఉజ్వ‌ల్ ర‌మ‌ణ్ సింగ్ గెలిచారు.

స‌మాజ్ వాదీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ రేవతి ర‌మ‌ణ్ సింగ్ కుమారుడే ఉజ్వ‌ల్ ర‌మ‌ణ్ సింగ్‌. 2004, 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉజ్వ‌ల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ములాయం సింగ్ కేబినెట్‌లో ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా కూడా ప‌ని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్పీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అల‌హాబాద్ నుంచి ఉజ్వ‌ల్ గెలుపొందారు.

మాజీ ప్ర‌ధానులు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, వీపీ సింగ్ కూడా అల‌హాబాద్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలుపొందారు. బీజేపీ అగ్ర నాయ‌కుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. 1984లో ఇందిరా గాంధీ హ‌త్య అనంత‌రం అల‌హాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అమితాబ్ బ‌చ్చ‌న్ పోటీ చేసి విజ‌యం సాధించారు. నాటి ఎన్నిక‌ల్లో లోక్‌ద‌ళ్‌కు చెందిన హెచ్ఎన్ బ‌హుగుణ‌ను అమితాబ్ ఓడించారు. ఎంపీగా ఎన్నికైన మూడేండ్ల‌కే అమితాబ్ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఉప ఎన్నిక‌లో వీపీ సింగ్ గెలుపొందారు.

Latest News