న్యూఢిల్లీ: ప్రొటెం స్పీకర్ ఎంపిక అంశం వివాదాన్ని రేపింది. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేశ్‌ను విస్మరించి, బీజేపీ సభ్యుడు భర్తృహరి మహతాబ్‌ను ఎంపిక చేయడంపై ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించే కార్యక్రమంలో మహతాబ్‌కు సహకరించేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్ నుంచి సురేశ్‌తోపాటు.. మరో ఇద్దరు ప్రతిపక్ష ఎంపీలు వైదొలగనున్నట్టు తెలుస్తున్నది.
కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక కార్యక్రమాలు నిర్వహించేందుకు మహతాబ్‌తో ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో ఆయనకు సహకరించేందుకు సురేశ్‌తోపాటు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, బీజేపీ నేతలు రాధామోహన్‌సింగ్, ఫగ్గన్‌సింగ్ కులస్తేలతో ప్యానెల్‌ను రాష్ట్రపతి ప్రకటించారు. జూన్ 24 నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
సభలో అత్యంత సీనియర్‌గా ఉన్న సురేశ్‌ను కాదని ఒడిశాలోని కటక్ నుంచి ఏడోసారి గెలుపొందిన మహతాబ్‌కు ప్రొటెం స్పీకర్ బాధ్యత ఇవ్వడాన్ని ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మావెలికర సీటు నుంచి సురేశ్ ఎనిమిది పర్యాయాలు విజయం సాధించారు.
సురేశ్ దళితుడు కావడంతోనే బీజేపీ ఆయనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టిందని కాంగ్రెస్ మండిపడింది. మహతాబ్‌కు సహకరించే ప్యానెల్ నుంచి సురేశ్, బాలు, బందోపాధ్యాయ వైదొలుగుతారని ఇండియా కూటమి వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ప్రతిపక్షం వాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. వెస్ట్‌మినిస్టర్ వ్యవస్థ ప్రకారం.. సుదీర్ఘకాలం వరుసగా గెలుస్తూ వచ్చిన సభ్యుడినే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు తెలిపారు. మహతాబ్ వరుసగా ఏడు పర్యాయాలుగా గెలుస్తూ వచ్చారని చెప్పారు. మంత్రులను పక్కనపెడితే.. సుదీర్ఘకాలంగా ఆయన సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు కే సురేశ్ సుదీర్ఘ పదవీకాలంలో మధ్యలో విరామాలు ఉన్నాయని అన్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరుగలేదని వివరణ ఇచ్చారు.
ప్రొటెం స్పీకర్ విషయంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో రాబోయే లోక్‌సభ సమావేశాలు వాడిగా వేడిగా కొనసాగుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నీట్ అవకతవకలు, నెట్ పరీక్ష రద్దు, బెంగాల్‌లో రైలు ప్రమాదం, కొత్త నేర చట్టాల అమలు, ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆకస్మాత్తుగా షేర్ మార్కెట్ పెరగడం, ఫలితాల రోజున పడిపోవడం సహా పలు అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సన్నద్ధమవుతున్నది. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల వెనుక మోదీ, అమిత్‌షా ప్రమేయం ఉన్నదని ఆరోపించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు.
మూడు నేర చట్టాల అమలును పక్కనపెట్టాలని ఇప్పటికే ఇండియా కూటమిలోని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతాబెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి మూడు నేర చట్టాలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదించుకున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈ మూడు కొత్త చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిని పూర్తిగా సమీక్షించేందుకు హోం శాఖ ఒక స్థాయీ సంఘాన్ని నియమించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నది.