విధాత : అయోధ్యలో నిర్మించతలపెట్టిన మసీదు దేశంలోనే అతిపెద్ద మసీద్‌గా, తాజ్‌మహల్ కంటే అద్భుతంగా ఉండబోతుందని బీజేపీ నేత హజి అర్పత్ షేక్ వెల్లడించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతించిన సందర్భంలో ఇదే పట్టణంలో మరో చోట కొత్త మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్ధలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ఉత్తర ప్రదేశ్ సర్కార్ ఆ స్థలాన్ని కేటాయించింది. అయోధ్య నిర్మించే మసీదు భారత్‌లోనే అతిపెద్దదిగా నిర్మాణం కానుండగా, దీని ప్రాంగణంలో 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ ఉంటుందని షేక్ తెలిపారు. అన్ని మతాలు, కులాల ప్రజలు భోజనం చేసే వెసులుబాటు ఉందని, ఒకేసారి 5 వేల మంది భోజనం చేయవచ్చని వివరించారు.
కేవలం నమాజ్ చేసేందుకే కాకుండా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 500 పడకల క్యాన్సర్ ఆసుపత్రి ఉందని తెలిపారు. మసీదు ప్రాంగణంలో పలు దంత, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని వెల్లడించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా 45 రోజులపాటు విరాళాలు సేకరించి రూ.2,100 కోట్లు వసూలు చేసిందని, ఇదే తరహాలో అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఐఐఎఫ్‌సీ ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరిస్తుందని షేక్ తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ మైనారిటీ మాజీ చైర్‌పర్సన్ అయిన షేక్ ఐఐఎఫ్‌సీ ట్రస్టీగా, దాని సలహాదారుల్లో ఒకరుగా ఉన్నారు. మసీదు మస్జిద్-ఎ-అయోధ్య పేరును మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదుగా ఆయన మార్చడం జరిగింది.