Site icon vidhaatha

రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు

కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే గందరగోళం
బిల్లులు ఆమోదించే విషయంలో కేంద్రం క్లారిటీ

విధాత : ఏదైనా బిల్లులు ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ధిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు నిర్ధేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు తెలపాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసుపై కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ద్వారా తన అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ఉన్నత న్యాయస్థానానికి అందించింది. కొన్ని అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. గవర్నర్లు కేవలం కేంద్రానికి దూతలు మాత్రమే కాదు. గవర్నర్లు పరోక్ష ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం ద్వారా ప్రజాస్వామ్య చట్టబద్ధతను కలిగి ఉంటారని తెలిపింది. ఆర్టికల్ 200 ద్వారా రాష్ట్ర బిల్లులకు ఆమోదం తెలిపే గవర్నర్ అధికారం లేదా ఆర్టికల్ 201 రాష్ట్ర బిల్లులను పరిగణనలోకి తీసుకునే రాష్ట్రపతి అధికారానికి ఏ నిర్దిష్ట కాలపరిమితిని అందించలేదని కేంద్రం వివరించింది.

అంతేకాకుండా రాష్ట్ర బిల్లులపై ఏవైనా సందేహాలు తలెత్తితే ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టును సంప్రదించమని రాష్ట్రపతిని ఆదేశించడం వల్ల రాజ్యాంగపరమైన ప్రత్యేక హక్కును న్యాయపరమైన ఆదేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సలహా కోరే పూర్తి విచక్షణ రాష్ట్రపతికి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. గవర్నర్, రాష్ట్రపతి విధుల్లో లోపాలుంటే న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజ్యాంగపరమైన యంత్రాంగాల ద్వారా సరిదిద్దాలని సూచించింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 3 నెలల్లో బిల్లులు ఆమోదించాలో, లేదా తిప్పి పంపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ద్వారా తమకు ఈ అధికారం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేదని అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందని రాష్ట్రపతి ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version