Suravaram Sudhakar Reddy | హైదరాబాద్ : సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83)( Suravaram Sudhakar Reddy ) ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల సీపీఐ నేతలతో పాటు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు నివాళులర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. వెంకట్రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సురవరం సుధాకర్ రెడ్డి ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు.
ఏఐఎస్ఎఫ్ నుంచి.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు
1998, 2004 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నుంచి గెలుపొంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగింది. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1957లో కర్నూల్‌లో చదువుతున్న రోజుల్లో పాఠశాలల్లో బ్లాక్ బోర్డ్స్, చాక్‌పీస్‌తో పాటు ప్రాథమిక అవసరాల కోసం సురవరం ఆందోళన చేపట్టారు. ఇది కర్నూల్‌లోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూల్ పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. 1962లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 62 రోజుల పాటు కొనసాగిన సమ్మెకు సురవరం నాయకత్వం వహించడంతో.. కర్నూల్‌లోని కాలేజీల విద్యార్థుల సంఘం అద్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1965లో ఓయూలో ఎల్ఎల్‌బీ చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కాలేజీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్ఎఫ్ ఏపీ రాష్ట్ర బాద్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఢిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్‌నకు జాతీయ అధ్యక్షుడు అయ్యారు.
CPI announces with profound grief the passing of our beloved former General Secretary, Comrade S. Sudhakar Reddy.
A lifelong fighter, he served as GS of CPI & twice represented Nalgonda in Lok Sabha. He will be remembered for his humility & commitment.
Red Salute, Comrade! pic.twitter.com/sGQmolJ5hA
— CPI – Communist Party of India (@CPI_National) August 22, 2025