విధాత : పన్నుల ఎగవేత లక్ష్యంగా బడాబాబులు అక్రమ మార్గాల్లో ఫోర్జరీ పత్రాలతో భూటాన్ నుంచి వాహనాలు దిగుమతి చేసుకున్న కేసులో కస్టమ్స్ అధికారులు ఇప్పటిదాక 36కార్లు సీజ్ చేసినట్లుగా కమిషనర్ టి.టిజు తెలిపారు. రెండు రోజులుగా కేరళలోని సినీ నటుల సహా పలువురి నివాసాల్లో 30చోట్ల ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో చేపట్టిన సోదాలు చేపట్టామని తెలిపారు. సోదాలలో నటుడు దుల్కర్ సల్మాన్ వద్ద ఉన్న రెండు వాహనాలతో పాటు మొత్తం 36 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వాహనాలను ఎవరి నుంచి కొనుగోలు చేశారు? అందుకు సహకరించినవారు ఎవరు? తదితర విషయాలను ఆరా తీస్తున్నామని తెలిపారు.
నటుడు దుల్కర్ వద్ద స్వాధీనం చేసుకున్న వాటిలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉన్నాయని.. ఇందులో ల్యాండ్ క్రూజర్‌ను త్రిశ్శూర్‌లో రిజిస్టర్ చేయించారని..అయితే ఈ కారు దుల్కర్ పేరు మీద లేదని గుర్తించామని టిజు తెలిపారు. ఈ కారుకు యజమాని ఎవరన్న దానిపై విచారణ కొనసాగుతుందన్నారు. దుల్కర్ వద్ద ఉన్న కార్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇతర అనుబంధ డాక్యుమెంట్‌లను సమర్పించాలని నటుడికి సమన్లు జారీ చేయబోతున్నారు. మరోవైపు ఈ తనిఖీల్లో భాగంగా నటుడు అమిత్ చక్కలకల్ నివాసంలో ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిల్లో ఒక్క కారే తనదని, మిగిలినవి నావి కావంటూ ఆ నటుడు వివరణ ఇచ్చారు. జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలోఉంచుకొని ఈ కార్ల కొనుగోలు వ్యవహారంలో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.