ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నన్ను అడ్డుకునే కుట్ర: కేజ్రీవాల్‌

  • Publish Date - April 3, 2024 / 06:40 PM IST

న్యూఢిల్లీ : కేజ్రీవాల్‌ను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు లిక్కర్‌ పాలసీ కేసులో ఆయనను సమయం చూసుకుని మరీ అరెస్టు చేశారని సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. తొలి ఓటు పడకముందే ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేసే ఉద్దేశంతోనే కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. లిక్కర్‌ పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తరఫున వాదనలు వినిపించిన సింఘ్వి.. ఆయన ఎన్నికలకు ముందు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సమానావకాశాలు అనేది ఒక పదమో, పదబంధమో కాదన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడం అందులో భాగమని చెప్పారు. ఆయనను అరెస్టు చేసిన సమయం చూస్తే.. ఆయన ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నదని, తొలి ఓటు పడటానికి ముందే ఆమ్‌ ఆద్మీ పార్మీని కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదించారు. తొలి సమన్లు జారీ అయిన 2023, అక్టోబర్‌ 30 నుంచి 9వ సమన్లు జారీ అయిన మార్చి 16, 2024 మధ్యలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 50 కింద ఒక్క ఆధారాన్ని కూడా ఈడీ సేకరించలేక పోయిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ముఖ్యమంత్రి పాత్రను కనుగొనాల్సి ఉందని ఈడీ తన రిమాండ్‌ పిటిషన్‌లో పేర్కొన్న అంశం.. ఆయన అరెస్టుకు ఏ మాత్రం ప్రాతిపదిక కాబోదని వాదించారు.

ఈడీ తరఫున ఎస్‌ రాజు తన వాదనలు వినిపిస్తూ.. కుంభకోణం ముమ్మాటికీ జరిగిందని అన్నారు. ‘ఈ రోజు మీరెంత మొత్తుకున్నా.. కుంభకోణం జరిగిందనేది, ప్రజాసొమ్ము దోపిడీకి గురైందనేది వాస్తవం. 100 కోట్ల మేరకు కుంభకోణం ఇప్పుడు జరగలేదనేది వాస్తవం. కానీ.. వారు ఎన్నికల పేరుతో తప్పించుకోలేరు. ఎన్నికలనేవి ఇప్పుడు వచ్చాయి. ఈడీ ఏమీ ఇప్పటికిప్పుడు క్రియాత్మకంగా మారిందికాదు’ అని అన్నారు. కుంభకోణం డబ్బులను గోవా ఎన్నికల్లో ఉపయోగించినందున అవి దొరకలేదు. డబ్బులను విదేశాలకు కూడా తరలించారు. ఇప్పుడు ఈడీ ఆ సొమ్ము ఏమైందని ప్రశ్నిస్తే.. మీరు తెలియదని చెబుతున్నారు’ అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Latest News