Site icon vidhaatha

Delhi High court | తప్పుడు వాగ్ధానంతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమే : ఢిల్లీ హైకోర్టు

false-promise

Delhi High court : ఒక మహిళ ఒక పురుషుడి వాగ్ధానాన్ని నమ్మి, అన్నీ ఆలోచించుకుని తనకు తానుగా అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని అపోహ మీద ఆధారపడిన బంధం అనలేమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పురుషుడు పెండ్లి చేసుకుంటానంటూ మోసపూరిత హామీ ఇచ్చి మహిళను లొంగదీసుకోవడం మాత్రం అది కచ్చితంగా నేరమే అవుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు తాజా కేసులో నిందితుడిని నేరస్తుడిగా పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ తీర్పు ఇచ్చారు.

అయితే ప్రస్తుత కేసులో యువతి, యువకుడు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు కాబట్టి సమస్య సామరస్యంగా పరిష్కారమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటానంటూ వాగ్ధానం చేసి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్న యువకుడు ముఖం చాటేశాడని, తల్లిదండ్రులు వేరే మహిళతో నిశ్చితార్థం చేయించినందున నిన్ను పెండ్లి చేసుకోలేను అని చెప్పాడని ఓ యువతి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. పిటిషనర్‌, నిందితుడు ఇద్దరూ కోర్టు బయట పరిష్కారం కుదుర్చుకుని పెండ్లి చేసుకున్నారు. అనంతరం అతడు తనను మోసం చేస్తాడనే భయంతోనే మానభంగ నేరం కింద అతనిపై అభియోగం దాఖలు చేశానని, ఇప్పుడు పెండ్లి చేసుకుని ఇద్దరం ఆనందంగా జీవిస్తున్నందున కేసును ఉపసంహరించుకుంటున్నానని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆమె అభ్యర్థనకు ఆమోదం తెలిపి యువకుడిపై కేసును కొట్టేసింది.

Exit mobile version