- బీజేపీతో ఈసీ కుమ్మక్కు
- జనాభా కంటే ఓటర్లే ఎక్కువ
- ఓటర్ల జాబితా అక్రమాల వల్లే ఓడిపోయాం
- ఈసీ రాజీపడినంతకాలం సరైన ఫలితాలు రావు
- రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
విధాత : ఈసీ, బీజేపీ కుమ్మక్కుతో దేశంలో భారీ నేరం జరుగుతోందని లోక్ సభ విపక్షనాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో కొన్ని విషయాలను ఆయన బయటపెట్టారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుస్తున్నట్లు ఈసీ చెబుతోందని, కానీ, ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పరిశోధన చేసిందని తెలిపారు. ఇందులో తమ అనుమానాలు చాలా వరకు నిజమయ్యాయన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగడం వల్లే తాము ఓడిపోయామని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఐదు నెలల్లో 40 లక్షల ఓటర్లు నమోదయ్యారని ఆయన చెప్పారు. ఐదేళ్లలో నమోదైనవారికంటే ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ నమోదైందన్నారు. దీనికి సంబంధించిన సీసీఫుటేజీ అడిగినా ఈసీ ఇవ్వలేదని రాహుల్ అన్నారు. ఈ డాటాను ఈసీ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓట్ల చోరీ జరిగిందనే అనుమానాలను మహారాష్ట్ర ఫలితాలు రుజువు చేశాయన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వ్యవధిలో కోటి మంది ఓటర్లు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో మొత్తం జనాభా కంటే ఎక్కువ ఓటర్లు నమోదయ్యారని రాహుల్ ఆరోపించారు.
LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi | #VoteChori | AICC HQ, New Delhi. https://t.co/3WzBejfgrw
— Congress (@INCIndia) August 7, 2025
కర్ణాటకలో 16 ఎంపీ సీట్లు గెలుస్తామని అంచనా వేశామని, కానీ పార్టీకి 9 ఎంపీ సీట్లే దక్కాయని రాహుల్ గాంధీ చెప్పారు. బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు 7 చోట్ల అనూహ్యంగా ఓడిపోయామన్నారు. బెంగుళూరు సెంట్రల్‌లోని మహదేవ్ పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేసినట్టు రాహుల్ చెప్పారు. ఒక్క మహదేవ్ పూర్ అసెంబ్లీలోనే బీజేపీకి 1,14,046 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. బెంగుళూరు సెంట్రల్ స్థానంలో తమ పార్టీ32 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైందని ఆయన అన్నారు. మహాదేవ్ పూర్ లో లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక్కడ సుమారు 12 వేల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, 40 వేలకుపైగా ఓటర్లకు నకిలీ ఐడీలు, అడ్రస్‌లున్నాయన్నారు. ఒకే అడ్రస్ తో 10,452 ఓట్లున్నాయని ఆయన వివరించారు. ఫామ్- 6 ను తప్పుగా వాడి 33,692 ఓట్లు వేశారని ఆయన తెలిపారు. ఒకే ఫోటోతో ఉన్న ఓటర్ల వివరాలను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మహదేవ్ పూర్ లో 0 ఇంటి నెంబర్ తో వందల ఓట్లున్నాయన్నారు. ఒకే ఇంటి సంఖ్యతో 80 ఓటర్లున్న ఇళ్లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఈసీ డాటా ప్రకారమే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇన్ని అక్రమాలు వెలుగు చూశాయన్నారు. ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్లు నకిలీవి, తప్పుడు చిరునామావేనని తమ పరిశోధనలో తేలిందని ఆయన వివరించారు. బీజేపీతో ఈసీ కుమ్మకైందని ఆయన ఆరోపించారు.
ఈసీ రాజీపడినంతకాలం బ్యాలెట్లతోనూ సరైన ఫలితాలు రావు
పలు రాష్ట్రాల్లో ఒకే వ్యక్తికి ఓట్లున్నాయన్నారు. తండ్రి పేరు స్థానంలో ఇష్టానుసారం ఆంగ్ల అక్షరాలు ముద్రించారని ఆయన చెప్పారు. తాము చేసిన ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెడుతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. 70 ఏళ్ల మహిళ ఫామ్ -16 వినియోగించి రెండు ఓట్లు పొందారని ఆయన చెప్పారు. 90 ఏళ్లకు పైబడిన చాలా మందికి ఫామ్ -16 ద్వారా ఓట్లు నమోదు చేశారన్నారు. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని రాహుల్ గాంధీ చెప్పారు. మెషీన్ రీడ్ చేయగల ఓటరు లిస్టును ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం తమ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని ఆయన అన్నారు. అక్రమాల్లో ఈసీకి భాగస్వామ్యం లేకపోతే ఓటరు జాబితా, సీసీపుటేజీ ఇవ్వచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితా దేశ సంపద, దానిని ఎందుకు చూపించడం లేదో చెప్పాలన్నారు. ఓటర్ల జాబితాను విశ్లేషించే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు. మహదేవ్ పూర్ లోనే కాదు అనేక నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగినట్టు విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగడం వల్లే తాము ఓడిపోయాని రాహుల్ తెలిపారు. ఓటర్ల జాబితా దేశ సంపద అని దానిని ఎందుకు చూపించడం లేదని ఆయన అడిగారు. ఈసీ రాజీపడినంతకాలం ఈవీఎంలతో సరైన ఫలితాలు రావని స్పష్టం చేశారు. ఈసీ రాజీపడినంతకాలం బ్యాలెట్లతోనూ సరైన ఫలితాలు రావాని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి మెరుగు అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంపైర్ పక్షపాతం వహిస్తే సరైన ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వంద శాతం రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ సమగ్రత కోల్పోతే ప్రజాస్వామ్యం నాశనమేనని ఆయన అన్నారు.
ఎగ్జిట్ పోల్స్, ఓపినియన్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయన్నారు. అంచనాలకు అందని విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటున్నాయని ఆయన అన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ ఊహకందని ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల సర్వే, తుది ఫలితాల మధ్య పెరుగుతున్న సంబంధం లేని విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత కొంతైనా ఉంటుందన్నారు. కానీ, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత రావడం లేదని ఆయన అన్నారు. ఎగ్జిట్ పోల్స్, ఓపినియన్ పోల్స్, తమ పార్టీ అంతర్గత రిపోర్టులు కూడా వాస్తవానికి భిన్నంగా ఉంటున్నాయని ఆయన వివరించారు. 25 ఎంపీ సీట్లు తక్కువగా వస్తే మోదీ ప్రధానిగా ఉండేవారు కాదన్నారు. 33 వేల ఓట్ల తేడాతో 25 ఎంపీ స్థానాలను బీజేపీ గెలిచిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.