ఎన్నికల బరిలోకి జార్ఖండ్ మాజీ సీఎం సతీమణి కల్పనా సోరెన్‌

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు

  • Publish Date - April 27, 2024 / 05:20 PM IST

గండీ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో పోటీ

విధాత, హైదరాబాద్ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ మేరకు జేఎంఎం పార్టీ అమెను తమ అభ్యర్థిగా ప్రకటించింది. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇటీవల రాజీనామా చేయడంతో గండీ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఈ ఎన్నిక కోసం జేఎంఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్‌ పేరు ఖరారయ్యింది. భూకుంభకోణం కేసులో ఆమె భర్త హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లడంతో పార్టీకి అన్నీ తానై ఆమె వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా బరిలో దిగి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. కాగా గండీ అసెంబ్లీ స్థానానికి ఐదో విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 20న పోలింగ్‌ జరగనుంది. కల్పనా సోరెన్‌ ఒడిశాలో పుట్టి పెరిగారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో ఆమె పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తిచేశారు.

మరోవైపు భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసేందుకు రాంచిలోని ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కు సంబంధించిన ప్రత్యేక కోర్టు నిరాకరించింది. హేమంత్‌ సోరెన్‌.. తన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 13 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ రాంచి కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది.

Latest News