క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డిదే..

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ గెలుపులో క్రెడిట్ అంతా సీఎం రేవంత్‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో స‌హ‌జంగానే ఒక‌రి మాట మ‌రొక‌రు విన‌రు.. పేరుకే పై పైన తిరుగుతూ వెళ‌తార‌న్న అప‌వాదు ఉన్నది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంద‌రూ ఎంత‌టి సీనియ‌ర్లు అయినా కానీ రేవంత్ గీసిన గీత దాట కుండా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుల్లా ప‌ని చేశార‌ని సీనియ‌ర్ జర్నలిస్టు ఒక‌రు చెప్పారు

CM Revanth Reddy

విధాత‌, హైద‌రాబాద్‌: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ గెలుపులో క్రెడిట్ అంతా సీఎం రేవంత్‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో స‌హ‌జంగానే ఒక‌రి మాట మ‌రొక‌రు విన‌రు.. పేరుకే పై పైన తిరుగుతూ వెళ‌తార‌న్న అప‌వాదు ఉన్నది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంద‌రూ ఎంత‌టి సీనియ‌ర్లు అయినా కానీ రేవంత్ గీసిన గీత దాట కుండా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుల్లా ప‌ని చేశార‌ని సీనియ‌ర్ జర్నలిస్టు ఒక‌రు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఎన్నిక‌ల ప్రచారం ముగిసే వ‌ర‌కు త‌మ‌కు కేటాయించిన డివిజన్లలోనే ఉండి ఇంటింటికి ప్రచారం నిర్వహించారని చెపుతున్నారు.

సీనియ‌ర్ మంత్రులు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంక‌ట‌ స్వామి టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌దిర నేత‌లు బాధ్యతలు తీసుకొని ప‌ని చేశారు. సీఎం రేవంత్ రెడ్డి త‌న‌ ప్యూహానికి అనుగుణంగా ఈ నేత‌లంద‌రిని ప‌ని చేయించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రుల‌కు బాధ్యతలు అప్పగించి ఊరుకోకుండా నియోజ‌క‌వ‌ర్గం అంతా క‌లియ తిరిగారు. కార్నర్ మీటింగ్‌లు పెట్టి క్యాడ‌ర్‌లో జోష్ తీసుకు వ‌చ్చారు.

మంత్రులు ఇత‌ర ప్రజా ప్రతినిధులంతా కూడా ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోక‌పోతే తీవ్ర స్థాయిలో నష్టపోతామని గ్రహించారు. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ ఎన్నిక‌ను సీరియ‌స్‌గా తీసుకున్నది. మ‌రో వైపు ఎమ్మెల్యేల అనర్హత పిటీష‌న్ విచార‌ణ కొనసాగుతున్నది. ఏదో ఒక నాడు ఆయా ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు ప‌డే అవ‌కాశం ఉన్నది. ఇప్పటికే ప‌శ్చిమ బెంగాల్‌లో హై కోర్టు ఒక ఎమ్మెల్యేను తాజాగా డిస్ క్వాలిఫికేష‌న్ చేసిన విష‌యం తెలిసిందే.. ఇలాంటి ప‌రిణామాల నేప‌ధ్యంలో మ‌రి కొన్ని నియోజ‌క వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశాన్ని కూడా కొట్టి పార‌వేయ‌లేం.. నిజంగానే ఉప ఎన్నిక అంటూ వ‌స్తే ఈ ఎన్నిక‌లో గెలిస్తేనే వాటిల్లో పోరాటం చేయ‌గ‌లం అని కాంగ్రెస్ పార్టీ నేత‌లు, మంత్రులు భావించినందువల్లనే సిన్సియ‌ర్‌గా ప‌ని చేశార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జరుగుతున్నది.

అలాగే స్థానిక సంస్థల ఎన్నిక‌లు కూడా తప్పని స‌రిగా నిర్వహించాలి.. ఈ మేర‌కు హై కోర్టు కూడా త్వరలో ఉత్తర్వులు ఇచ్చే అవ‌కాశం కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవ‌డానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బూస్టింగ్‌లా ఉపయోగ ప‌డుతుంద‌ని అంటున్నారు. రానున్న విష‌మ పరీక్షలను త‌ట్టుకొని నిల‌బ‌డి విజ‌యం సాధించాలన్న ఉద్దేశంతో ఈ నేత‌లంతా సీఎం రేవంత్ ఆదేశాల మేర‌కు క‌ట్టు తప్పకుండా ప‌ని చేశార‌ని అర్థం అవుతున్నదని ఓ సీనియ‌ర్ జర్నలిస్టు వెల్లడించారు.