Site icon vidhaatha

Bijapur | బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం..

encounter

Bijapur | ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. పొర్చెలి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను నిర్మూలించేందుకు బలగాలు ప్రత్యేకంగా ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో బీజాపూర్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత గంగలూరు ప్రాంతంలో భద్రతా దళ సిబ్బంది సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన బలగాలు తిరిగి కాల్పులు జరిపారు. ఇందులో ఎనిమిది మంది నక్సల్స్‌ ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఘటనా స్థలం వద్ద మందుపాతరలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లో డీఆర్‌జీ బస్తర్‌ ఫైటర్స్‌, 208 కోబ్రా సంయుక్త బృందం సోమవారం పెసెల్‌పాడ్‌, దొరమంగు అటవీ ప్రాంతంలో ఓ నక్సలైట్‌ను హతమార్చింది. బీజీఎల్‌ రైఫిల్, పెద్ద మొత్తంలో సెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో పార్లమెంట్‌ ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్‌ 19న బస్తర్‌లో పార్లమెంటరీ నియోజకవర్గంలో తొలి దశ ఓటింగ్‌ జరుగనున్నది. ఎన్నికలపై భద్రతాదళాలు అప్రమత్తమై పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. నక్సలైట్ల కార్యకలాపాలపై నిఘా వేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version