విధాత : భారీ వర్షాలు..వరదలతో పాటు ఉప నదులు వైనతేయ, వశిష్ట, గౌతమీ, వృద్ధ గౌతమి నదుల వరద ఉదృతి తోడవ్వడంతో గోదావరి( Godavari flood) పోటెత్తి ప్రవహిస్తుంది. గోదావరి ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. తెలంగాణ జిల్లాల మీదుగా భారీ వరద ప్రవాహంతో సాగిపోతున్న గోదావరి భద్రాచలం దగ్గర 42.4 అడుగుల వద్ధ ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 12.5 అడుగుల వద్ధ ప్రవహిస్తుండగా..అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక(Davaleswaram first danger warning) జారీ చేశారు. రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ లో ముందస్తు హెచ్చరికలు లేకపోవడం..వరద ఉదృతిని అంచనా వేయలేకపోవడంతో నది స్నానాలకు ఘాట్ లోకి దిగిన ఇద్దరు భవాని భక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని గుబ్బల బాపిరాజు, వీరబాబులుగా గుర్తించారు. వారి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
గోదావరి వరద పోటెత్తడంతో కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నరసాపురం సఖినేటిపల్లి మధ్య పంట్ రవాణా సేవలను అధికారులు నిలిపివేశారు. కోనసీమ-పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి దగ్గర తాత్కాలిక గట్టు తెగింది. గోదావరి ఉప నదులు వైనతేయ, వశిష్ట, గౌతమీ, వృద్ధ గౌతమి నదులు పొంగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎదురుబిడియం, అప్పనపల్లి కాజ్ వేల మీదుగా, అలాగే కనకాయలంక కాజ్ వేల మీదుగా వరదనీరు ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోయాయి.