మోదీని ఆ దేవుడే పంపించాడట!

మోదీని బీజేపీ భక్తులు దేవుడిగా సంబోధించడం చాలా కాలంగా వింటున్నదే. ఆ మధ్య బీజేపీ ఎంపీ బండి సంజయ్‌.. మోదీనుద్దేశించి.. దేవుడన్నా.. మోదీ.. అంటూ వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే.

  • Publish Date - May 23, 2024 / 05:12 PM IST

టీవీ ఇంటర్వ్యూలో తన జన్మ కారణాన్ని వివరించిన మోదీ
దేవుడు పంపాడు కాబట్టి ఆయనను వ్యతిరేకించకూడదా?
ఎన్నికల జిమ్మిక్కులో భాగమేనంటున్న విశ్లేషకులు
మోదీ భ్రమలు స్థాయి దాటి పోయాయన్న జైరాం రమేశ్‌
ఆయన మాటలు ఓటమికి సంకేతమని వ్యాఖ్య

న్యూఢిల్లీ: మోదీని బీజేపీ భక్తులు దేవుడిగా సంబోధించడం చాలా కాలంగా వింటున్నదే. ఆ మధ్య బీజేపీ ఎంపీ బండి సంజయ్‌.. మోదీనుద్దేశించి.. దేవుడన్నా.. మోదీ.. అంటూ వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. నిన్నగాక మొన్న పూరి బీజేపీ అభ్యర్థి ఏకంగా జగన్నాథుడు సైతం మోదీ భక్తుడని చెప్పి.. ఆనక నాలుక్కర్చుకున్నారు. ఇప్పుడు మోదీ.. తాను దేవుడినని చెప్పుకోలేదు కానీ.. సాక్షాత్తూ ఆ పరమాత్ముడే తనను పంపించాడని చెప్పుకోవడం విశేషం. తాను దేవుడి దూతనని తనకు అర్థమైపోయిందని చెప్పారు. తాను ఏదో చేయాల్సి ఉన్నందున ఆ పని పూర్తి చేసేందుకు తనను ఎంచుకుని, తన శరీరంలోకి ఆ శక్తిని ప్రవేశపెట్టారని చెప్పుకొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో తన జన్మకారణాన్ని వివరించిన మోదీ.. ‘అమ్మ బతికి ఉన్నంత కాలం తన జన్మ స్వాభావికమేనని అనుకునేవాడిని. అమ్మ వెళ్లిపోయిన తర్వాత ఈ అనుభవాలన్నింటినీ కలగలిపి చూస్తే ఆ పరమాత్ముడే నన్ను పంపించాడని నాకు నమ్మకం కలిగింది’ అని న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. మంగళవారం సాయత్రం నుంచి ఆ ఇంటర్వ్యూలోని కొంత భాగం వైరల్‌ అయ్యింది. ‘నాదేమీ లేదు. దేవుడు ఏదో సాధించాలని నిర్ణయించుకుని పంపిన సాధనాన్ని మాత్రమే.

కాబట్టి.. నేను ఏదైనా చేయాలని అనుకుంటే అది దేవుడు కోరుకున్న పని అని నేను నమ్ముతాను’ అని మోదీ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. తాను దేవుడిని చూడలేక పోయినందున ఈ దేశంలోని 140 కోట్ల మందిని దేవుళ్లుగా భావించి.. వారిని పూజిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ఏదో పనిమీద, ఏదో ఉద్దేశంతో దేవుడే నన్ను పంపాడు. అది సాధించేందుకు ఆయన నాకు మార్గదర్శనం, విద్య, సామర్థ్యం, శక్తి, స్ఫూర్తి ఇచ్చాడు. ఇది దివ్యశక్తి అంటారేమో. లేదా దేవుడి శక్తి’ అంటూ తన శక్తి గురించి అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పారు.

అయితే.. మోదీ చేసిన పనులు ప్రశ్నించకూడదా?

ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల ఎన్నికల్లో బీజేపీకి ఆశించినంత సీన్‌ లేదన్న వార్తల నేపథ్యంలో మోదీ ఈ కొత్త పల్లవి అందుకున్నారని, తాను పరిశుద్ధుడినని చెప్పుకొని, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘అంటే ఇప్పుడు మోదీని దేవుడే పంపించాడు కనుక.. ఆయన ఏం చేసినా వ్యతిరేకించకూడదా?’ అని ఒక సీనియర్‌ జర్నలిస్టు సందేహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదని, ఈ క్రమంలోనే తననెవరూ ప్రశ్నించకూడదు.. తనకు ఓటు వేసి తీరాల్సిందే అనే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసేలా ఆయన మాటలు ఉన్నాయని ఆ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ఇది జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమేనని స్పష్టం చేశారు. ఎప్పుడో వారం క్రితం ఇంటర్వ్యూలో ఒక భాగాన్ని ఇప్పుడు పనికట్టుకుని వైరల్‌ చేయడం వెనుక ఉద్దేశాలను గమనించాల్సి ఉన్నదని ఓ సీనియర్‌ విశ్లేషకుడు అన్నారు. తాను చేసే ప్రతిపని దేవుడు చెప్పిందే అయితే.. ప్రజలు పెద్ద నోట్ల రద్దు కష్టాలను కానీ, కొవిడ్‌ సమయంలో పడిన ఇబ్బందులను గానీ, కొందరు శతకోటీశ్వరులకే దేశంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులు అప్పనంగా కట్టబెడుతుండటాన్ని గానీ దేన్నీ ప్రశ్నించకూడదని చెప్పడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఓటమికి సంకేతం: జైరాం రమేశ్‌

మోదీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ మీడియా ఇన్‌చార్జ్‌ జైరాంరమేశ్‌.. ‘దిగిపోయే ప్రధాని తనను తాను దేవుడిగా భావించుకుంటున్నారు. ఇది మునుపెన్నడూ చూడని స్థాయి భ్రమ, అహంకారం. బీజేపీకి ఎదురుకాబోయే ఓటమికి ఇది సంకేతం’ అని అన్నారు. దానితోపాటే జగన్నాధుడు మోదీ భక్తుడంటూ బీజేపీ నేత సంబిత్‌ పాత్రా చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జైరాం రమేశ్‌ జోడించారు. పాత్రా వ్యాఖ్య పొరపాటున మాట జారింది కాదని, స్వీయ భ్రాంతిలో ఉండే వ్యక్తి పట్ల గుడ్డి భక్తితోనే ఆయన అలా మాట్లాడారని అన్నారు.

Latest News