Site icon vidhaatha

Bridge collapse | బీహార్‌లో పేక మేడల్లా కూలుతున్న వంతెనలు.. తాజాగా కూలిన మరో బ్రిడ్జి.. 17 రోజుల్లో 12వ ఘటన..!

Bridge collapse : బీహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. ఒకదాని వెనుక మరొకటి పోటీపడి కుప్పకూలిపోతున్నాయి. గత 17 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు వంతెనలు కుప్పకూలాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. గురువారం సరన్ జిల్లాలోని గ్రామాలను, సివాన్ జిల్లాను కలుపుతూ గండకి నదిపై ఉన్న 15 ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల డీసిల్టింగ్ పని జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా సరన్ జిల్లాలో గత 24 గంటల్లో మూడు వంతెనలు కూలినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ చెప్పారు. రాష్ట్రంలోని అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన అన్ని పాత వంతెనలను గుర్తించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్వేకు ఆదేశించిన మరుసటి రోజే ఈ ఘటనలు జరిగాయి.

వంతెన నిర్వహణ విధానాలను మెరుగుపర్చాలని రహదారుల నిర్మాణం, గ్రామీణ పనుల శాఖలకు సీఎం నితీశ్‌ ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సివాన్‌, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్‌ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు.

Exit mobile version