Jan Suraaj Party | పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల( Bihar Assembly Elections ) నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ( Jan Suraaj Party )గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్( Prashant Kishor ).. 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఓ ట్రాన్స్‌జెండర్( Transgender )కు అవకాశం కల్పించారు. సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) కేబినెట్‌లోని విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్( Sunil Kumar )పై ట్రాన్స్‌జెండర్ ప్రీతి కిన్నార్( Preeti Kinnar )ను పోటీకి దింపారు.
భోరే( Bhorey ) నియోజకవర్గం పరిధిలోని కల్యాణ్‌పూర్ గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ ప్రీతి కిన్నార్.. సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా ఆమె సోషల్ వర్క్ చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్నారు. స్థానిక సమస్యలపై కూడా ఆమె పోరాటం చేశారు. పలు సమస్యలను పరిష్కరించడంలో కూడా ఆమె పాత్ర ఉంది. ఈ క్రమంలోనే ప్రీతి కిన్నార్‌ను భోరే నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని, అసెంబ్లీకి పంపిస్తారన్న నమ్మకం ఉందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
దశాబ్ద కాలంగా ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు పోటీ చేస్తున్నప్పటికీ గెలిచిన దాఖలాలు లేవు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు కేవలం 85 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు పోటీ చేయగా, ఏ ఒక్కరూ కూడా గెలుపొందలేదు. డిపాజిట్లు కోల్పోయారు.
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జన్ సురాజ్ పార్టీ.. విద్యావేత్తలకు, సామాజిక కార్యకర్తలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించింది. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, పాట్నా యూనివర్సిటీ మాజీ వీసీ కేసీ సిన్హానకు ప్రశాంత్ కిశోర్ టికెట్ ఇచ్చారు. కేసీ సిన్హా రాసిన పాఠ్య పుస్తకాలు.. బీహార్ స్కూళ్లల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాలను విద్యార్థులు చదువుకుంటున్నారు. బీహార్ మాజీ అడ్వకేట్ జనరల్ వైబీ గిరిని కూడా ప్రశాంత్ కిశోర్ ఎన్నికల బరిలో దించారు. వైబీ గిరి మాంజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.