రేపే జూబ్లీహిల్స్..బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి రేపుతున్నాయి.

విధాత, హైదరాబాద్ : రేపు శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు రెండు విడతులు(నవంబర్ 6, 11)గా పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీహర్ ఎన్నికలలో అధికార జేడీయూ, బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతున్నట్లుగా వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంతా బూమ్ రాంగ్ కాబోతున్నాయని, ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమి నేత తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బీహర్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగనుంది. కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున స్టేడియం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాధ్, బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డిల మధ్య పోటాపోటీ సాగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలబోతున్నట్లుగా వెల్లడించాయి. బీఆర్ఎస్ సైతం గెలుపుపై ధీమాగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49శాతం పోలింగ్ నమోదైంది.