Tejashwi Yadav | పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మహాఘటబందన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. 36 ఏండ్ల తేజస్వీ.. మహాఘటబంధన్ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నాయి.
ఇక తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో 2015 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో 38 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తేజస్వీపై బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీ కూడా ఈ స్థానంలో పోటీ చేసింది.
బిహార్‌లో మెుత్తం 243 స్థానాలకు ఈనెల 6, 11న రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ఫిగర్ 122. ఇక అధికార ఎన్డీయే, విపక్ష మహాగట్‌బంధన్ మధ్య పోటీ ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ(రామ్‌విలాస్), హెచ్‌ఏఎం, రాష్ట్రీయ లోక్‌మోర్చా ఉన్నాయి. మహాగట్‌బంధన్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్, వీఐపీ, సీపీఐ, సీపీఎం, ఐఐపీ, జనశక్తి జనతాదళ్ ఉన్నాయి. 238 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ పోటీ చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 67.13 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్‌లో 1951 తర్వాత ఈసారే అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం. 2020తో పోలిస్తే ఈసారి 9.84 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది.
