న్యూఢిల్లీ : ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఒక వ్యవస్థాగత రూపాన్ని పొందనున్నది. కూటమిలో ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వహించాలో పది పదిహేను రోజుల్లో తేల్చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్‌ను ఎన్నుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీట్ల సర్దుబాటు సహా ఇతర కీలక అంశాలన్నీ తర్వలోనే పరిష్కరించుకుంటామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెలాఖరుకల్లా ఇవి ఒక కొలిక్కి వస్తాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోని మొత్తం 545 లోక్‌సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ పనిచేస్తున్నదని, వాటికి ఇప్పటికే పరిశీలకులను నియమించిందని ఖర్గే తెలిపారు. అయితే.. ఆయా సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలి? ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే అంశాలపై త్వరలోనే ప్రతిపక్ష నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని స్థానాల నుంచి బరిలో ఉంటుందన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘మేం ఇప్పటికే అన్ని సీట్లలోనూ పరిశీలకులను నియమించాం. ప్రతి నియోజకవర్గానికీ వెళ్లి పరిస్థితిని అంచనా వేస్తాం. చివరిగా ఇండియా కూటమి నేతలతో ప్రతి రాష్ట్రంలో చర్చిస్తాం. అప్పుడే మేం ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం అన్న విషయంలో స్పష్టత వస్తుంది’ అని తెలిపారు.
10-15 రోజుల్లో తేల్చేస్తాం
ఇండియా కూటమికి కన్వీనర్ ఎవరు? అన్న ప్రశ్నకు.. ఆయన ‘ఇది కౌన్ బనేగా కరోడ్‌పతి అని అడిగినట్టుంది’ అని బదులిచ్చారు. తాము తదుపరి సమావేశం నిర్వహించినప్పుడు 10-15 రోజుల్లో ఎవరు ఏ బాధ్యతలో ఉండాలో నిర్ణయిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు అంతా కలిసి ఐక్యంగా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
బీజేపీ ఓటమితోనే న్యాయం
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ న్యాయం జరిగే వరకూ పోరాడుతారా? అని ప్రశ్నించగా.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా న్యాయం లభిస్తుంది’ అని ఖర్గే చెప్పారు. కూటమి పక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.