ఇరాన్-అమెరికా యుద్దంతో హర్మూజ్ జలసంధి మూసుకపోయి..అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 55% మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకుంటుంది. రోజుకు దాదాపు 2.7 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం గుండానే దిగుమతి అవుతాయి. మనదేశంలో చమురు నిల్వ సామర్థ్యం దాదాపు 74 రోజులకు మాత్రమే సరిపోతుంది. హర్ముజ్ జలసంధిని మూసివేతతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. బ్రెంట్ ముడి చమురు ధర పెరుగుదల నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుంది
ప్రత్యామ్నాయంగా తెరపైకి ఒమన్ గుజరాత్ పైప్ లైన్
ఇంధన ధరల పెరుగుదల రవాణా, ఆహారం, తయారీ రంగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మొదలయ్యాయి. చమురు కోసం అధికంగా ఖర్చు పెట్టడం సాధారణంగానే రూపాయిని బలహీనపరుస్తుంది. ఇప్పటికే రూపాయి పతనం కారణంగా దిగుమతుల వ్యయం పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రమాదం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు దేశ ప్రధాని ఇంధన పొదుపు, దిగుమతులు తగ్గించుకుని విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని సూచించారు. అంతేకాదు హర్మూజ్ కు ప్రత్యామ్నాయంగా రూ.40,000 కోట్లతో ఒమన్ నుంచి గుజరాత్ వరకు సముద్ర గర్బంలో గ్యాస్ పైప్‌లైన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఒమన్ పైప్ లైన్ సాధ్యమేనా..ఖర్చు ఎంత?
ఒమన్ నుంచి గుజరాత్ వరకు సముద్రంలో గ్యాస్ పైప్ లైన్ నిర్మించడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ కేంద్రం దీనిని ఏడేళ్లలో నిర్మించాలని భావిస్తుంది. ఏడేళ్లు ఆగితే చెల్లించే ఖర్చు రూ. 25 లక్షల కోట్లు అవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రూ.40,000 కోట్ల పైప్‌లైన్ కోసం ఏడేళ్లు ఎందుకు ఆగాలి?
హార్మూజ్ జలసంధి మూసుకుపోయింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 60 డాలర్ల నుంచి 100 డాలర్లపైకి దూసుకెళ్లింది. ఆ డాలర్ల తేడాకు భారత్ నెలనెలా చెల్లిస్తున్న మూల్యం రూ.30,000 కోట్లు. సంవత్సరానికి లెక్కేస్తే రూ.3.6 లక్షల కోట్లు. ఇది మన రక్షణ బడ్జెట్‌లో సగం. ఇది మన రైల్వే బడ్జెట్‌కు దాదాపు సమానం. క్రూడాయిల్ అదనపు చెల్లింపుల భారాన్ని తగ్గించుకునేందుకు హర్మూజ్ మార్గానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్లతో ఒమాన్ నుంచి గుజరాత్ వరకు లోతుసముద్ర గ్యాస్ పైప్‌లైన్ వేయాలని నిర్ణయించింది. ఇది సరైన నిర్ణయమే. దేశం తప్పకుండా వేయాల్సిన పైప్‌లైన్ ఇది. కానీ ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా పడుతుందని చెప్పడమే విమర్శలకు తావిస్తుంది.
ఏడేళ్ళు ఆగితే నష్టం ఎంతో లెక్కించారా?
క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు నెలకు రూ.30,000 కోట్లు అంటే ఏడేళ్ళలో భారత్ అదనంగా కోల్పోయేది ఏకంగా రూ.25 లక్షల కోట్లు. ఒమాన్ నుంచి గుజరాత్ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణ వ్యయం రూ. 40,000 కోట్లు. మరో మాటలో చెప్పాలంటే ఒక్క పైప్‌లైన్ ఖర్చు కంటే అరవైరెట్లు ఎక్కువ మొత్తం ఈ ఏడేళ్ళలో గల్ఫ్ దేశాల జేబులోకి వెళ్ళిపోతుంది. ఈ లెక్కన పైప్‌లైన్ వేయడానికి ఏడేళ్లే ఆగడం ఆర్థిక అత్మహత్యతో సమానం అని నిపుణులు చెబుతున్నారు.
మూడేళ్ళలో వేయడం సాధ్యమేనా ?
ఓమన్ నుంచి గుజరాత్ వరకు సముద్రంలో పైప్ లైన్ నిర్మాణాన్ని ఏడేళ్లలో కాకుండా మూడేళ్లలో పూర్తి చేస్తే ఆ మేరకు గల్ప్ దేశాలకు చెల్లించే రూ.25లక్షల కోట్ల భారం తగ్గిపోతుంది. అయితే ఇది సాధ్యమా అంటే సంకల్పం ఉంటే సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు.
చైనా 2020లో దేశవ్యాప్తంగా కోవిడ్ లాక్‌డౌన్ మధ్య సైతం Power of Siberia గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం ఆపలేదు. రష్యా యుద్ధ సమయంలో TurkStream పైప్‌లైన్ పూర్తిచేసింది. అయితే సముద్రంలో పైప్ లైన్ నిర్మాణంలో సాంకేతిక సవాళ్ళు ఉండటం అంగీకరించాల్సిందే. 3,450 మీటర్ల లోతు సముద్రంలో పైప్ లైన్ నిర్మాణం సులభం కాదు. అయితే అసాధ్యమైన అవరోధంగా మాత్రంగా పరిగణించలేం. పైప్ లైన్ వేగంగా వేయాలన్న దృఢ సంకల్పానికి అవన్ని అడ్డు నిలబడవు అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు.
ప్రభుత్వం ఏం చేయాలి?
మొదటగా గ్యాస్ పైప్ లైన్ ఫీజబిలిటీ( Feasibility Report) కోసం రెండేళ్ళు వేచిఉండకూడదు. SAGE ఇప్పటికే Pre-Feasibility అధ్యయనం పూర్తిచేసింది. GAIL, Engineers India, IOCలకు గరిష్టంగా ఆరు నెలల గడువు ఇవ్వాలంటున్నారు. సమాంతరంగా Omanతో Government-to-Government చర్చలు వెంటనే ప్రారంభించాలని సూచిస్తున్నారు. రెండవ ప్రతిపాదనలలో నిధులకు వేచి ఉండకుండ..ఈ ప్రాజెక్టును National Security Priority గా ప్రకటించి Abu Dhabi Investment Authority, Qatar Investment Authority వంటి సావరిన్ ఫండ్స్‌తో కో-ఫైనాన్సింగ్ చేసుకోవాలంటున్నారు. వారికి కూడా ఈ ప్రాజెక్టు లాభదాయకమే అయినందునా వారు ఇందుకు ముందుకొస్తారనడంలో సందేహం లేదంటున్నారు.
మూడవ ప్రతిపాదనలో సముద్రంలో ఒకేసారి బహుళ విభాగాల్లో నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు. ఒమన్ వైపు నుంచి, గుజరాత్ వైపు నుంచి ఏకకాలంలో పని మొదలుపెట్టాలని చెబుతున్నరు. అంతర్జాతీయ అనుభవం ఉన్న Saipem, Allseas వంటి సముద్రగర్భ పైప్‌లైన్ నిర్మాణ సంస్థలను వెంటనే భాగస్వాముల్ని చేసుకుంటే పనులు వేగంగా పూర్తవుతాయని సూచిస్తున్నారు.
ఇది కేవలం గ్యాస్ పైప్‌లైన్ కాదు..భారత్ ఆర్థిక పురోగతి మార్గం
ఒమన్ నుంచి గుజరాత్ వరకు నిర్మించే గ్యాస్ పైప్ లైన్ కేవలం ఓ పైప్ లైన్ మాత్రమే కాకుండా భారత్ శక్తి సార్వభౌమత్వానికి పునాది అని, ఆర్థిక పురోగతి మార్గం అని, ఇంధన దిగుమతుల రంగంలో గేమ్ ఛేంజర్ అంటున్నారు నిపుణులు. హార్మూజ్ తలుపు తెరిచినా.. మూసినా భారత్ వంటగది వెలుతురు ఆరిపోకూడదన్నదే ఈ పైప్ లైన్ ప్రధాన లక్ష్యం. ఈ పైప్ లైన్ ఎల్పీజీ సిలిండర్ కొనడానికి సామాన్యుడు తిప్పలు మార్గంగా కేంద్రం భావిస్తుంది. పైప్ లైన్ నిర్మాణానికి రూ.40,000 కోట్లు పెద్ద మొత్తమే. కానీ ఏడేళ్ళు ఆగితే చెల్లించే రూ.25 లక్షల కోట్లతో పోలిస్తే ఇది చాలా చిన్న పెట్టుబడి.
అత్యవసర పరిస్థితుల్లో అసాధ్యమైనవి సాధించిన చరిత్ర భారత్‌కు ఉంది. ఇప్పుడూ అదే చేయాలి.. ఏడేళ్ళ కు బదులుగా మూడేళ్ళకు పైప్ లైన్ నిర్మాణం వ్యవధి మార్చి దేశ ప్రగతిలో మైలురాయిగా నిలపాలని నిపుణులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
యూపీలో గాలి వాన బీభత్సవానికి 113 మంది బలి!
జనానికే పొదుపు సుద్దులు..విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
