విశ్వగురు ! నిజాలు దాస్తున్నారా!..ఆర్థిక బుడగ పేలనుందా ?

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై అనుమానాలకు దారితీశాయి. వికసిత్ భారత్‌ నినాదం నుంచి సంక్షోభ హెచ్చరికల దాకా మారిన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  1. ప్రపంచంలోనే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా (వికసిత్ భారత్) మార్చడమే లక్ష్యం అంటూ నిన్నమొన్నటిదాక ఊదరగొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా పశ్చిమాసియా యుద్దంతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని..ప్రజలు పొదుపు మార్గాలు అనుసరించాలంటూ చెప్పడం సామాన్యులను..ఆర్థిక నిపుణులను సైతం నివ్వెర పరుస్తుంది. అమెరికా-ఇరాన్ యుద్దంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నందుకే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందా?..లేక అంతకుముందే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందా? అన్న సందేహాలు ఇప్పుడు సామాన్యుడిని సైతం తొలిచి వేస్తున్నాయి. ఎంతటి సంక్షోభాన్నైనా విశ్వగురువు ప్రచారం చేసుకునే ప్రధాని మోదీ దాటిస్తారనుకుంటే.. పొదుపు ప్రవచనాలు చెప్పి ఆర్థిక పతనం బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారా ? అన్న ప్రశ్న దేశ వాసుల్లో పొడసూపుతుంది. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే..ఏదో ఒక రోజు భారత ఆర్థిక వ్యవస్థ(ఆర్థిక బుడగ)పేలిపోవడం ఖాయం అంటూ ..ఇప్పుడు పొదుపు నీతులు చెబుతున్న ప్రధాని..ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు అదే మాటలు ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు.

ఎన్నికలకు ముందు మభ్యపెట్టే మాటలు..తర్వాతా సంక్షోభం హెచ్చరికలు

అధిక జనాభా, పటిష్టమైన దేశీయ ఉత్పత్తి, డిమాండ్‌తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ కొనసాగుతోంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందుకూడా ప్రధాని మోదీ.. ఇరాన్-అమెరికా యుద్ద సవాళ్లను భారత్ కు అధిగమించే సత్తా ఉందని, దేశీయ గ్యాస్ నిల్వలు ఉత్పత్తి పెంచుతున్నామని, ఇంధన కొరతను ఇతర దేశాల సహాయంతో అధిగమిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆకస్మాత్తుగా నాలుక మడతేసి దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది..ప్రజలు త్యాగాలు చేయాలంటూ చెప్పడం ఏమిటని సగటు పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదిడ్డంగా హామీలు ఇచ్చేసి.. ఎన్నికల అయిపోగానే పొదుపు మంత్రం పఠిస్తున్న మోదీ వైఖరిని జనం అసహ్యించుకుంటూ ఇదంతా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ విమర్శిస్తున్నారు.

అసలు ఆర్థిక సంక్షోభం ఎప్పటి నుంచి….

అసలు దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికిప్పుడు సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నట్లుగా ప్రధాని చెప్పిన మాటల వెనుక వాస్తవం ఏంతమేరకు ఉందన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. నోట్ల రద్దు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ ఎదుగుతూ వస్తుందన్న వాస్తవాలు అందరికి తెలిసిందే. అలాంటప్పుడు పశ్చిమాసియా యుద్దంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని మోదీ ఎలా తేలుస్తునారు…ఇంతకాలం నిజాలు దాచిపెట్టి ఎన్నికల తీరం దాటేశాక..అక్కరతీరిన మాటలు చెబుతున్నారా అంటూ జనం మండిపడుతున్నారు. మరింత ముందే చెప్పి ఉంటే ప్రజలకు మరికొంత ప్రయోజనంగా ఉండేది కదా అని ప్రశ్నిస్తున్నారు. ముందే చెబితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తాయని తెలిసే ఆగారా? అలాగైతే అది ప్రధాని మోదీ వైఫల్యతగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభంతో చమురు ధరలు పెరిగి.. నిత్యవసర ధరల పెరిగి సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందంటూ ప్రధాని చెప్పిన మాటలతో సామన్య జనంలో ఆందోళన మరింత అధికమైంది. మరోవైపు ప్రధాని సంక్షోభం మాటలతో స్టాక్ మార్కెట్లు పతనమై లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకులలో నగదు నిల్వల కొరత ఎదురవుతుంది. దీంతో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడి శ్రీలంక తరహా సంక్షోభం ఎదురైతే ఇందుకు దేశ ప్రధానిగా మోదీనే బాధ్యత వహించాలంటున్నారు.

ఇంతకాలం వికసిత్ భారత్ ..ఇప్పుడు సంక్షోభ భారత్

12ఏళ్ల తన పరిపాలనలో .. మేక్ ఇన్ ఇండియా’ ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసి, ప్రపంచ సరఫరా గొలుసులో భారత్‌ను కీలక భాగస్వామిగా మారిందని, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పారిశ్రామిక ప్రగతి దూసుకపోతుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. డిజిటల్ ఇండియా, యూపీఐ లావాదేవీలు, ఫిన్‌టెక్ ఆవిష్కరణల ద్వారా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, వేగం పెరిగిపోయిందని గొప్పలు చెప్పారు. అకస్మాత్తుగా ప్రధాని మోదీ ఒక్క పశ్చిమాసియా యుద్దంతో దేశం ఆర్థిక సంక్షోభంలో పడిందంటూ చెబితే ..జనం గుడ్డిగా నమ్మెయాలా?..త్యాగాలకు సిద్దం కావాలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 6.5% – 8% వరకు వృద్ధిరేటుతో, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (PPP లెక్కల మేరకు 3.36 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని మోదీ మాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు.ఉత్పాదకరంగంలో భారత్ కొత్త రికార్డులు చూస్తుందని డిఫెన్స్ ప్రొడక్షన్ ఒక్కటే రూ.1.25 లక్షల కోట్లు దాటిందంటూ గొప్పలు చెప్పాడని, అంతటి భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగి కుప్పకూలడానికి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న విశ్వగురు మోదీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

మోదీ మాటలతో సంక్షోభం మరింత తీవ్రతరం

తన సుదీర్ఘకాల పరిపాలనలో ఆర్థిక వ్యవస్థలోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో మోదీ వికసత్ భారత్ మాట మార్చేసి..ప్రధానిగా తను చెప్పే మాటల ప్రభావం దేశ ప్రజలపైన, ఆర్థిక వ్యవస్థపైన , అభివృద్ధిపైన ఎంతటి ప్రభావం చూపుతుందో కూడా పట్టించుకోకుండా సంక్షోభపు మాటలు చెప్పడం బాధ్యతారాహిత్యం అన్న విమర్శలు చెలరేగుతున్నాయి. తన మాటలతో దేశం ఎంత నష్టపోతుందో మోదీ అంచనా వేశాడా?..ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకునే పొదుపు సలహాలు ఇచ్చాడా? అన్న ప్రశ్నలు దేశ పౌరులను వేధిస్తున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందన్నది నిజమే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు పెరగడం దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ‘హార్ముజ్ జలసంధి’ వంటి కీలక చమురు సరఫరా మార్గాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. చమురు ధరలు పెరిగితే ప్రభుత్వంపై ఇంధన, ఎరువుల సబ్సిడీల భారం పెరుగుతుందని, ఇది ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తుందని మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ హెచ్చరిస్తుంది. పెరుగుతున్న ప్రపంచ, దేశీయ సవాళ్ల దృష్ట్యా 2026 సంవత్సరానికి భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాను 6 శాతానికి తగ్గిస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న అంచనాల కంటే ఇది 0.8 శాతం తక్కువ కావడం గమనార్హం. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే మోదీ ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారు..అంటే ఆయన విశ్వసనీయ విశ్వగురువు…నిజాయితీపరుడైన సమర్థపాలకుడు కాదా? అంటూ నిలదీతలు వినిపిస్తున్నాయి.

సలహాలు సరే..సంక్షోభ నివారణ మార్గాలు ఏవీ ?

పశ్చిమాసియా యుద్దంతో చమురు, యూరియా, బంగారం వంటి వాటి ధరలు పెరిగిపోతున్నాయని..త్వరలో అన్ని రకాల ధరలు పెరుగవచ్చని హెచ్చరిస్తున్న ప్రధాని మోదీ..ఆయా సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు..తీసుకబోతున్న చర్యలను దేశ ప్రజలకు వివరించకపోవడాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. తన నాయకత్వ, పాలనా వైఫల్యాలను పొదుపు సలహాల మాటునా…పశ్చిమాసియా అంతర్జాతీయ సంక్షోభం నీడన..విదేశీ మారక నిల్వల పరిరక్షణ చర్యల పేరుతో కప్పిపుచ్చుకుంటున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే అది మా ఘనతగా ..సంక్షోభంలో పడితే ప్రజల బాధ్యతగా మోదీ మాటలు అవకాశవాద , అసమర్థ పాలన విధానాలను నిదర్శనంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు విదేశాల్లో నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ10లక్షలు వేస్తానని, పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రగతిని పరుగులు పెట్టిస్తానని చెప్పి..ఇప్పుడు ప్రజలకు పొదుపు నీతులు చెబుతున్న ప్రధాని మోదీ బడాయి మాటలను పార్టీ శ్రేణులు భరించినా..జనం భరించబోరని తగిన సమయంలో గుణ పాఠం చెబుతారంటున్నారు. పాలకుడిగా తన వైఫల్యాన్ని ప్రజలపై రుద్దితే..సమయం వచ్చినప్పుడు ఎంతటి బలవంతుడైనా నాయకుడైనా ప్రజాతీర్పులో కొట్టుకపోక తప్పదన్నది చారిత్రాక సత్యం అని గుర్తు చేస్తున్నారు.

పొదుపు జనానికేనా…నేరగాళ్లు..నేతలకు వర్తించవా..?

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ తాజా మాటాలు చూస్తే..ఊపర్ షర్వాణీ..అందర్ పరేషానీ అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల వేటలో..అధికార సాధన ఆటలో జనాన్ని మోదీ మాటలతో భారత్ వెలిగిపోతుందని నమ్మించారని..సంక్షోభ సమయం రాగానే ప్రజలకు త్యాగాల మాటలు చెప్పి తన వైఫల్యాలను దాటవేస్తున్నారన్న వాదన బలపడుతుంది. అసలు విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ ప్రభుత్వం వైఫల్యంతోనే పశ్చిమాసియా సంక్షోభం భారత్ పై మరింత ఎక్కువగా పడేలా చేసిందన్న ఆరోపణలను రగిలిస్తున్నాయి. మోదీ పాలనలో ఇప్పటికే కార్పోరేట్ వర్గాల ఆధిపత్యం పెరిగిపోతుందని, ఆదాని, అంబానీల చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందన్న విమర్శలు బలపడ్డాయి. ఆర్థిక నేరగాళ్లు లక్షలకోట్ల రుణాలను ఎగేవేసి బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారు. ఈ 12ఏళ్లలో రూ.10 లక్షల కోట్లను బ్యాంకులో రైట్ ఆఫ్ చేశాయి. సంక్షోభ సమయంలో అలాంటి ఆర్థిక నేరగాళ్లు ఎగవేసిన సొమ్మును రికవరీ చేస్తామని చెప్పుకుండా…మధ్య తరగతి, సామాన్య జనం త్యాగాలకు, పొదుపుకు సిద్దం కావాలంటూ ప్రధాని చెప్పడం అన్యాయంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

త్యాగాలు జనానికి..భోగాలు మీకా?

ఖజానాలో విదేశీ మారక నిల్వలు పెంచేందుకు జనం ప్రజారవాణ వినియోగించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలంటూ ప్రధాని మోదీ సూచించారు. భారీ నిర్మాణాలకు, ప్రాజెక్టులకు దూరంగా ఉండాలన్నారు. మరి ఇంతకాలం ఖజనా నింపేందుకు జీఎస్టీ, సుంకాలు, చార్జీల పేరుతో జనం నుంచి వసూలు చేసిన సొమ్ము ఖర్చు పెట్టిన పాలకుడిగా..సంక్షోభ సమయంలో జనంపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. గత పాలకులు దేశం ఎదుర్కొన్న సంక్షోభ సమయాల్లోనివారణకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశాకే..జనం బాధ్యతలను గుర్తు చేశారు. ప్రధానిగా మోదీ కూడా తాను సంక్షోభ నివారణకు ఏం చేశానో చెప్పకుండానే ముందుగానే జనానికి పొదుపు మంత్రం వినిపించడం విడ్డూరంగా ఉందన్న విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు.

అదిగాక ప్రజలకు ప్రయాణాలు, ఖర్చులు, బంగారం కొనుగోలు తగ్గించుకోవాలంటూ చెబుతున్న ప్రధాని మోదీ తనతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలతో పాటు దేశంలోని చట్టసభల ప్రజాప్రతినిధుల పర్యటనలను తగ్గించడం, శ్రీలంక తరహాలో జీతభత్యాలలో కోతలు పెట్టుకోవడం ఎందుకు చేయడం లేదంటూ సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు. త్యాగాలు జనానికి..భోగాలు మీకా? అన్న ప్రశ్నలతో జనం ఫైర్ అవుతున్నారు. భారీ నిర్మాణాలకు దూరంగా ఉండాలంటూ జనానికి సలహాలు ఇచ్చిన ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశాల్లో కొత్తగా భారీ ప్రాజెక్టులను ఆమోదించడం ఎందుకని నిలదీస్తున్నారు.

ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అని ఆంక్షలు అమలు పెడుతూ.. బంగారం దిగుమతి నియంత్రణకు 6శాతం సుంకాలను 15శాతంకు పెంచడం, త్వరలో దశల వారిగా పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగవచ్చంటూ సంకేతాలివ్వడం చూస్తుంటే దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెలుతుందన్న ఆందోళన నిజమేనపిస్తుంది. దేశ ఆర్థిక సంక్షోభంపై ప్రధానిగా భాధ్యతతో దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జనం ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌
Heat Wave | రాబోయే నాలుగు రోజులు మండుటెండ‌లే..! జ‌ర జాగ్ర‌త్త సుమా..!!

Latest News