పశ్చిమాసియా యుద్దంతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని..విదేశీ మారక నిల్వల పరిరక్షణకు ఇంధన పొదుపు చేయాలని, బంగారం కొనుగోలు చేయవద్దని, విదేశీ పర్యటనలు నిలిపేసుకోవాలని దేశ ప్రజలకు సలహాలు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. తను మాత్రం మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. మే 15 నుంచి మే 20 వరకు ఆరు రోజుల పాటు ఐదు దేశాలు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల పర్యటనకు మోదీ బయలుదేరారు.
ఇంధనం, రక్షణ, వాణిజ్యం, సాంకేతికత రంగాల్లో సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుందని, మొదట యూఏఈని సందర్శించి, అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు చేస్తారని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశానికి నిజంగానే ప్రయోజనకరమైతే..సాధారణ రోజుల్లో మోదీ విదేశీ పర్యటనలను ఎవరు వేలెత్తి చూపేవారు కాదు. కాని ఓ వైపు దేశ ప్రజలకు పొదుపు ప్రవచనాలు చెప్పి..మోదీ మాత్రం పాటించకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
పొదుపు హడావుడి ప్రచారానికేనా..?
పెట్రోల్, డీజిల్ ఆదా చేయండి, ప్రజారవాణ వినియోంచండి, వంట నూనె తగ్గించండి, బంగారం కొనకండి, ఇంట్లోంచే పని చేయండి, విదేశీ పర్యటనలు చేయకండంటూ మోదీ తాజాగా దేశ ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని సహా ప్రజాప్రతినిధులు ముందుగా పాటించి ప్రజలకు చెప్పాలంటూ అంతే స్థాయిలో కౌంటర్లు సైతం వినిపించాయి. దీంతో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పర్యటన ఖర్చులను తగ్గించుకునే చర్యలు చేపట్టారు. కాన్వాయ్ ల కుదింపు, అనవసర పర్యటనలు తగ్గించుకుంటున్నట్లుగా రెండు మూడు రోజులు హడావుడి చేశారు. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వాలు పొదుపు చర్యల పేరుతో కొన్ని నామామత్ర చర్యలు చేపట్టాయి. అయితే పలుచోట్ల బీజేపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయ్ లతో మళ్లీ మోదీ పొదుపు మాటలను భేఖాతర్ చేశారు. ఇది ఇలా ఉండగానే ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లడంతో పొదుపు సుద్దులు ప్రజలకేనా?..పాలకులకు కాదా? అంటూ జనం నిలదీస్తున్నారు.
ఏపీలోనూ అదే తంతు..
నాదేశం – నా బాధ్యత పేరుతో పొదుపు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేశ్ సైతం కాన్వాయ్ కుదింపు చర్యలు తీసుకున్నారు. కేబినెట్ లో ప్రజలు అనుసరించాల్సిన పొదుపు చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం వంటి చర్యలు ప్రకటించారు. ఇకపై మంత్రులకు ప్రత్యేక విమానాల ప్రయాణాలుండవని మంత్రి పార్ధసారధి వెల్లడించారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లాకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి కేబినెట్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు. పుట్టపర్తి నుంచి ధర్మవరానికి భారీ కాన్వాయ్‌లో వెళ్లిన లోకేశ్ వెళ్లారు. ఆ మరుసటి రోజునే శుక్రవారం స్వయంగా సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లి తను చెప్పిన పొదుపు మంత్రాన్ని తనే విస్మరించేశారు.
ఇవి కూడా చదవండి :
Tata Altroz | ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో టాటా ఆల్ట్రోజ్ iCNG.. ధర ఎంతంటే..!
మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
