మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
నీట్-యూజీ 2026 రద్దు... మోదీ ప్రభుత్వ నియంతృత్వ... నిరంకుశ నిర్ణయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత పదేండ్లుగా ప్రధాని మోదీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధాత, హైదరాబాద్: నీట్-యూజీ 2026 రద్దు… మోదీ ప్రభుత్వ నియంతృత్వ… నిరంకుశ నిర్ణయమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత పదేండ్లుగా ప్రధాని మోదీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు.
నీట్ రద్దు.. దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్నారు.
నిరాశలో విద్యార్థులు, తల్లిదండ్రులు
వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని రేవంత్ రెడ్డి చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం కల్లలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంతమంది పేరెంట్స్ నగలు అమ్మి తమ పిల్లలను నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ చేయించారని… వారి ఆశలన్నీ గల్లంతవడం బాధాకరమన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ల లీక్
2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయన్నారు.
2014 మే నెలలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశంలోని ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ విడుదల చేసిన “ది పేపర్ లీక్ డెకేడ్” శ్వేతపత్రం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర పరీక్షలలో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. వీటివల్ల సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని చెప్పారు. 2024లో కేవలం ఎనిమిది వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని తెలిపారు. నీట్-యూజీ (24 లక్షల మంది అభ్యర్థులు), యుజిసి-నెట్ (9 లక్షలు), సిఎస్‌ఐఆర్-నెట్, నీట్-పిజి రద్దు అయినట్టు గుర్తు చేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష (16 లక్షల మంది మహిళలతో సహా 48 లక్షల మంది అభ్యర్థులు) కూడా కొన్ని రోజుల్లోనే రద్దైందని, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 14 ప్రధాన లీక్‌లు జరిగాయన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (తప్పుడు మార్గాల నివారణ) చట్టం’ను ఆమోదించినప్పటికీ, పెద్ద కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత, 2024 జూన్ వరకు దాని నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసిందన్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హామీ ఇచ్చారు. నీట్ రద్దు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని హమీనిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram