విధాత, హైదరాబాద్ : అమెరికా – ఇరాన్ మధ్య రెండో దశ చర్చలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల ప్రతినిధుల బృందాల మధ్య శాంతి చర్చలు కొనసాగనున్నాయి. శాంతి చర్చల కోసం సోమవారం సాయంత్రానికి అమెరికా బృందం పాకిస్తాన్ చేరుకోనుంది. చర్చల్లో పాల్గొననున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాక్ వెలుతున్నారు.
ఇరాన ప్రకటనతో శాంతి చర్చలపై మళ్లీ ప్రతిష్టంభన
అయితే శాంతి చర్చల్లో పాల్గొనే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రకటించడంతో రెండో ధఫా చర్చలపై సందిగ్థత నెలకొంది. అమెరికా వైఖరి, అసంబద్ధ షరతులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ వైఖరి కారణంగానే శాంతి చర్చల పట్ల విముఖంగా ఉన్నామని ఆ దేశం వెల్లడించింది. ఏప్రిల్ 22వరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలులో ఉండగానే…మా దేశానికి చెందిన తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా దిగ్బంధం చేయడం ఒప్పంద ఉల్లంఘనేనంటు ఇరాన్ అభ్యంతరం వెల్లడించింది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఐఆర్‌జీసీ దళం అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. గల్ఫ్‌ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది. అమెరికా తీరు కారణంగానే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేశామని ప్రకటించింది. అమెరికాతో రెండో దశ చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
యుద్దాన్ని ముగించాలనుకుంటున్నాం : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధమైన అణు హక్కులను హరించే అధికారం ట్రంప్‌నకు లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు. అణు హక్కులను వినియోగించకూడదని ట్రంప్ మాపై ఆంక్షలు పెడుతున్నారని.. కానీ ఏ నేరానికి ఈ శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పట్లేదన్నారు. ఒక దేశం హక్కులను హరించడానికి ట్రంప్ ఎవరని ప్రశ్నించారు. యుద్ధాన్నివిస్తరించే ఆలోచన తమకు లేదన్నారు. అదే విధంగా దేశంలో శాంతి, స్థిరత్వం, భద్రతను పరిరక్షించే బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లే గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యానికి సూచించారు.
చర్చలతో ఒప్పందానికి రాకపోతే విధ్వంసమే : ట్రంప్
అయితే ఇరాన్ నౌకా దిగ్బంధం విషయంలో వెనక్కి తగ్గబోమని అమెరికా స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని.. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. హర్మూజ్ మూసివేతతో ఇరాన్ రోజుకు సుమారు రూ.4,600 కోట్లు (500 మిలియన్ డాలర్లు) నష్టపోతోందన్నారు. అమెరికాకు ఏ నష్టమూ లేదని స్పష్టం చేశారు. శాంతి చర్చలతో ఒప్పందానికి రాకపోతే విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు.
రెండో దఫా శాంతి చర్చకు తమ దేశ ప్రతినిధులు సోమవారమే పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. మేం న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ ముందుంచాం. ఆ దేశం దానిని అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేనిపక్షంలో ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను నాశనం చేస్తాం. ఇక మీదట అంత మంచివాడిలా ఉండబోనని, ఇరాన్ సమస్యకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది అని ట్రంప్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు
బీచ్ లో ఆలల చెంత సింహం..ఫోటో, వీడియో వైరల్
