భారతదేశంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రాజెక్టుగా ముంబయి–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ రూపుదిద్దుకుంటోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున సాగనున్న ఈ ప్రాజెక్టులో 352 కి.మీ. గుజరాత్ రాష్ట్రంలో, 156 కి.మీ. మహారాష్ట్రలో నిర్మాణం జరుగుతోంది. జపాన్ దేశ శింకాన్సన్(Shinkansen) హైస్పీడ్ రైలు సాంకేతికత ఆధారంగా ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత, భారతదేశంలో రైలు ప్రయాణం పూర్తిగా కొత్త మలుపు తిరగనుంది.
ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 310 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది. 15 నదులపై వంతెనలు నిర్మించబడగా, 12 స్టేషన్లలో ఐదు పూర్తయ్యాయి. నాలుగు స్టేషన్ల నిర్మాణం తుదిదశకు చేరుకుంది. థానే, విరార్, బోయిసర్ స్టేషన్ల నిర్మాణం మహారాష్ట్రలో వేగంగా కొనసాగుతోంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో 32.5 మీటర్ల లోతులో నిర్మిస్తున్న స్టేషన్ ఒక ఆపూర్వ ఇంజినీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. దీని పైభాగంలో 95 మీటర్ల ఎత్తుతో కమర్షియల్ బిల్డింగ్ నిర్మించేందుకు అవసరమైనంత ధృఢంగా ఉంటుంది.
ఈ ప్రాజెక్టులో విశేష ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం 21 కిలోమీటర్ల పొడవున్న సముద్రాంతర్గత సొరంగం(Undersea Tunnel) నిర్మాణం. ఈ టన్నెల్ థానే క్రీక్ కిందుగా సాగనుంది. ఇందులో భాగంగా ఘాన్సోలీ-శిల్‌ఫటా మధ్య 2.7 కిలోమీటర్ల టన్నెల్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ టన్నెల్ నిర్మాణానికి New Austrian Tunnelling Method (NATM)తోపాటు టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM) వినియోగిస్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిని “మొదటి ముందడుగు”గా అభివర్ణించారు.
రైలు సేవల పరంగా చూస్తే, ప్రాజెక్టు ప్రారంభంలో జపాన్ శింకాన్సన్ ఇప్పటికే అక్కడ నడుస్తున్న E5 రైళ్ల(E5 Shinkansen)ను ట్రయల్స్‌కు ఉపయోగించనున్నారు. అనంతరం, వాణిజ్య సేవల కోసం కొత్త తరం అత్యంతాధునాతన E10 శింకాన్సన్(E10 Shinkansen) రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ రైళ్లు 2030లో జపాన్‌తో పాటు భారతదేశంలోనూ ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఈ E10 ట్రైన్లు ప్రస్తుత E5 శ్రేణికి మరింత మెరుగైన తరంగా నిలుస్తాయి. వేగం, భద్రత, ఆపరేషన్, సాంకేతికతలలో ఈ కొత్త శ్రేణి ప్రపంచ ప్రమాణాలను కొత్తగా లిఖించనున్నట్లు శింకన్సాన్ కంపెనీ తెలియజేసింది.
ఇప్పటికే కొన్ని E5 శ్రేణి రైళ్లను టెస్ట్ రన్ కోసం భారత్‌కు తీసుకువచ్చి పరీక్షలు జరుపుతున్నారు. ఈ ప్రయోగాల ద్వారా భారత వాతావరణానికి అనుగుణంగా E10 మోడల్‌ను రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక సవరణలు చేయనున్నారు. జపాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగంగా భారతదేశానికి E10 ట్రైన్లను మేకిన్ ఇండియా ద్వారా ఇక్కడే తయారుచేసేందుకు అంగీకరించింది. ఇది ఇరుదేశాల మధ్య స్నేహబంధానికి నిదర్శనం.
భవిష్యత్‌లో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ సేవలను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరిన్ని హైస్పీడ్ కారిడార్‌లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రయాణంతో ముంబయి–అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం రెండు గంటలకు తగ్గిపోనుంది. ప్రస్తుతం ఇది సగటున 6 నుండి 7 గంటల సమయాన్ని తీసుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిధులు, భూముల సేకరణ, సాంకేతిక పరమైన అనుమతుల విషయంలో అన్ని అవరోధాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తోంది. జపాన్‌తోపాటు యూరోపియన్ టెక్నాలజీ సంస్థలతో కలిసి భారత్ తన స్వంత బుల్లెట్ ట్రైన్‌ల తయారీదిశగా కూడా అడుగులు వేస్తోంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఇప్పటికే బీఈఎంఎల్ సంస్థతో కలిసి 280 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ ట్రైన్ డెవలప్‌మెంట్ పని ప్రారంభించింది.
సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థల కోసం యూరోపియన్ సాంకేతికత కలిగిన కంపెనీలతో కాంట్రాక్టులు కుదిరాయి. దీని ద్వారా భారతదేశపు బుల్లెట్ రైలు మౌలిక సదుపాయాల సాంకేతికత మరింత విస్తరించనుంది.
ఈ మొత్తాన్ని పరిశీలిస్తే, ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు మార్గం కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాకుండా, భారతదేశ ప్రగతికి ఒక ప్రతీకగా నిలవనుంది. రవాణా వ్యవస్థలో వేగం, భద్రత, సాంకేతికతలతో కూడిన కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు.
Categories: National News, Business News