Indigo : ఇండిగో ఫ్లైట్ల రద్దు..ప్రయాణికుల ఆగమాగం

ఇండిగో ఒకేసారి వందల ఫ్లైట్లను రద్దు చేయడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆగమాగం అయ్యారు. సిబ్బంది కొరతతో సమస్యలు కొనసాగుతున్నాయి.

Indigo

విధాత : ఇండిగో సంస్థ ఒకేసారి 550విమాన సర్వీసులను రద్దు చేసుకోవడంతో ప్రయాణికులు ఆగమాగం అయ్యారు. నిర్వాహణ సమస్యలు, సిబ్బంది కొరత నేపథ్యంలో ఇండిగో సంస్థ విమాన సర్వీస్ లను అకస్మాత్తుగా రద్దు చేసుకుంది. మూడు రోజులు గడుస్తున్నా పరిస్థితి ఇంకా చక్కబడలేదు. విమాన సర్వీస్ లు రద్దయిపోవడంతో కొందరు ప్రయాణికులైతే విమానాశ్రయాల్లోనే రెండు రోజులుగా పడిగాపులు పడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. విమాన సర్వీస్ ల వివరాలు కూడా చెప్పేవారు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఇండిగో సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రద్దయిన విమాన సర్వీసుల్లో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే రద్దవడం గమనార్హం.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి రోజుకు 230కి పైగా ఇండిగో విమానాలు బయల్దేరుతాయి. ఇక, బెంగళూరులో 100కి పైగా.. హైదరాబాద్‌ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులను ఎయిర్‌లైన్‌ రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్‌పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటలతరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో సరైన చోటు లేక.. చాలామంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సర్వీస్ ల పునరుద్దరణకు ఇండిగో తిప్పలు

సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఇండిగో సంస్థ నేడు కూడా ఫ్లైట్ సర్వీసుల రద్దు కొనసాగుతుందని తెలిపింది. పైలట్ల షెడ్యూల్‌కు సంబంధించి కొత్త నిబంధనల విషయంలో పొరపాటు పడ్డామని, ఫలితంగా సిబ్బంది కొరత తీవ్రంగా మారిందని డీజీసీఏకు వివరణ ఇచ్చింది. నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపును ఇవ్వాలని కూడా కోరింది. డిసెంబర్ 8 నుంచి పరిస్థితులు అదుపులోకి వస్తాయని తెలిపింది. పరిస్థితి చక్కదిద్దేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామని వివరించింది. ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ క్షమాపణలు తెలియజేసింది.

విమాన పైలట్లకు అధిక విశ్రాంతిని ఇచ్చేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు ఇటీవలే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు డ్యూటీ కేటాయింపు కోసం అవసరమైన సంఖ్యలో పైలట్‌లు లేకపోవడం, శీతాకాలంలో అవాంతరాలు మరింత పెరగడంతో ఇండిగో పలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఒకేసారి వందల సర్వీస్ లు రద్దయిపోవడం సమస్యలకు దారితీసింది.

ఇవి కూడా చదవండి :

Hyderabad : కారులో రూ.4కోట్ల హవాలా నగదు..సినీ ఫక్కిలో ఛేజ్ చేసిన పోలీసులు
Nirmala Sitharaman : బెంగాల్ నుంచి బాగో బాగ్

Latest News