IndiGo crisis Marxist analysis | ఇండిగో సంక్షోభం లేవనెత్తే ప్రశ్నలు, నేర్పే పాఠాలు – ఒక విశ్లేషణ

ప్రధానంగా ఇండిగో సృష్టించిన సంక్షోభాన్ని మార్క్సిస్ట్ దృక్కోణంతో చేస్తున్న విశ్లేషణ. అది లేవనెత్తిన ప్రశ్నలను, నేర్పుతున్న గుణపాఠాలను ప్రత్యామ్నాయ దృష్టి కోణంతో విశ్లేషణ చేసే ప్రయత్నమిది. ఇందులో తారీఖులు, దస్తావేజుల వంటి వివరాల కంటే, ఏ నిర్దిష్టమైన భౌతిక పరిస్థితుల్లో ఈ సంక్షోభం తలెత్తిందీ, ఇది ఏ ఏ పాఠాలను నేర్పుతున్నదీ సంక్షిప్తంగా విశ్లేషించే ప్రయత్నమే ఇది.

(పి. ప్రసాద్)

IndiGo crisis Marxist analysis | చరిత్ర గమనం ఎల్లప్పుడు సరళరేఖలో సాగదు. అది ముందుకూ, వెనక్కీ వూగుతూ మలుపులు తీసుకుంటూ సాగుతుంది. కొన్నిసార్లు ముందస్తు అంచనాలకు అందని అనూహ్య మలుపులు కూడా తీసుకుంటుంది. అలాంటి అరుదైన సందర్భాలలో సంభవించే పరిణామాలు ఆనాటి ఆర్ధిక, రాజకీయ, సాంఘిక వ్యవస్థలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తాయి. అవి సామాన్య ప్రజలను విభ్రమకు గురిచేస్తాయి. బుద్ధి జీవి వర్గాలను సైతం నిర్ఘాంతపరుస్తాయి. కానీ, కమ్యూనిస్టులను మాత్రం అవి దిగ్భ్రాంతికి గురిచేయలేవు. అందుకు తగిన హేతుబద్ధ కారణం వుంది.

చరిత్ర గమన సూత్రాల అధ్యయనంతో పాటు విశ్లేషణ చేసి మార్క్స్, ఎంగెల్స్ చారిత్రక భౌతికవాద విజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. బయటకు ఆకస్మిక లేదా అనూహ్య లేదా అద్భుత ఘటనలుగా కనిపించేవి సైతం చరిత్ర గర్భం నుంచి ఉత్పన్నమయ్యేవే. అవి నాటి సామాజిక వ్యవస్థ గర్భంలో దాగిన విరుద్ధ శక్తుల మధ్య పరస్పర సంఘర్షణ ఫలితాలు లేదా పర్యవసానాలే. మార్క్స్, ఎంగెల్స్ రూపొందించి, అందించిన చారిత్రక భౌతికవాద కళ్ళద్దాలు ధరించిన వారికవి అద్భుతాలుగా కనబడవు. వాటిని ధరించే పరిణతి చెందిన కమ్యూనిస్టులను అలాంటి పరిణామాలు నిర్ఘాంతపరచలేవు. ఇలాంటి పరిణామాలలో తాజా ఇండిగో సృష్టించిన సంక్షోభం కూడా ఒకటి!

ఒక అంచనా ప్రకారం భారతదేశ జనాభాలో విమాన ప్రయాణాలు చేసిన లేదా చేసే వారి సంఖ్య ఈనాటికీ 3 శాతం లోపే వున్నారు. వారిలో ఒక గణనీయ విభాగానికి చెందిన వారు అత్యవసరంగా లేదా అనివార్యంగా, అరుదుగా తమ జీవితాల్లో కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే ప్రయాణించిన వాళ్లే. మరో గణనీయ విభాగానికి చెందిన వారు విదేశీ విద్య, ఉద్యోగాల వంటి వృత్తులలో లేదా దేశంలో సుదూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసేవారు లేదా విద్యను అభ్యసించే వారే. మరో విభాగం వారికి రైలు వంటి ప్రత్యామ్నాయ
ప్రయాణ సాధనాలు అందుబాటులో వున్నా, అలవాటు ప్రాయంగా విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ఆఖరి కోవలోకి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, బూర్జువా పార్టీల రాజకీయ వర్గాలు, సంపన్న వర్గాల వంటి వారు వస్తారు. ఏమైనా విమాన ప్రయాణీకుల సంఖ్య దేశ జనాభాలో నేటికీ చాలా తక్కువ శాతం మందే వున్నారు. అయినా, ఇండిగో సృష్టించిన సంక్షోభం భారతదేశ పౌర సమాజాన్ని తీవ్రంగా చలింపచేయడం గమనార్హం!

రోడ్డు మార్గం గుండా బస్సు వంటి వాహనాలపై ప్రయాణించే వారి సంఖ్య జనాభాలో దాదాపు 95 శాతం వుంటుంది. రైలు ప్రయాణాలు చేసేవారి సంఖ్య సగానికి పైగా వుంటుంది. ఈ కోవలకు చెందిన కోట్లాది మంది ప్రయాణీకులు నిరంతరం అసౌకర్యాలకు గురౌతూ వున్నారు. నేడు ఒక్కొక్క బోగీలో రెండేసి, మూడేసి బోగీల జనాలతో కిక్కిరిసే ప్రయాణాలు చేస్తున్న విషయం చూస్తున్నదే. రైల్వే స్టేషన్లలో పూటల తరబడి ప్లాట్ ఫారాలపై పడిగాపులు కాస్తున్న విషాద దృశ్యాల్ని నిత్యం చూస్తున్నాం. అయినా, ఈనాటి స్థాయిలో పౌర సమాజాన్ని స్పందింప చేయడంలేదు. అదో సహజ విషయంగా మారింది. వాటిని బహిర్గతం చేసే పాత్రను మీడియా పోషించడం లేదు. కానీ, జనాభాలో ఒకటి రెండు శాతం విమాన ప్రయాణీకులకు చేకూరిన అసౌకర్యం మొత్తం పౌర సమాజంపై చాలా తీవ్ర ప్రభావాన్ని కలిగించింది. ముఖ్యంగా రాజకీయ సమాజాన్ని కదిలించింది. అందుకు కారణం వుంది.

నిజానికి ప్రయాణాల్లో అసౌకర్యాలకు గురయ్యే బాధితుల సంఖ్యను బట్టి వారి బాధలు వెలుగు చూడాల్సి వుంది. కానీ, అలా జరగడం లేదు. వారి సంఖ్య కంటే సమాజంలో వారి స్థానాన్ని బట్టి వెలుగు జూస్తుంది. బీదజనం కోట్ల మంది అనుభవించే బాధలు సాధారణంగా సమాజాన్ని ప్రభావితం చేయడం లేదు. కానీ మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి ప్రజల బాధలు సాపేక్షికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతకు మించి సంపన్న వర్గాల ఇబ్బందులు మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది బాధితుల సంఖ్యను బట్టి కాకుండా, వారి స్థానాన్ని బట్టి వుంటుంది. ఈ పరిణామాల దృష్ట్యా ఇండిగో సృష్టించిన సంక్షోభం అనూహ్య స్థాయిలో సమాజాన్ని ప్రభావితం చేయడం గమనార్హం!

ఇండిగో సృష్టించిన సంక్షోభం అందరికీ తెలిసిందే. దినపత్రికలు, టీవీ ఛానళ్ళు, సాంఘిక మాధ్యమాలు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. వాటి వివరాలు పాఠకులు, వీక్షకులకు తెలిసిందే. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి (9.12.2025) సంక్షోభం సమసిపోలేదు. ప్రచార సాధనాలలో దాని ప్రాధాన్యత తగ్గలేదు. పౌరసమాజంలో అదొక రగిలే సమస్య (బర్నింగ్ ప్రాబ్లమ్) గానే వుంది. ఇలా అందరికీ తెలిసిన ఈ సంక్షోభపు సాధారణ సమాచారాన్ని వ్యాసంలో పేర్కొనడం లేదు.

ఈ వ్యాసాన్ని ప్రధానంగా ఇండిగో సృష్టించిన సంక్షోభాన్ని మార్క్సిస్ట్ దృక్కోణంతో చేస్తున్న విశ్లేషణ. అది లేవనెత్తిన ప్రశ్నలను, నేర్పుతున్న గుణపాఠాలను ప్రత్యామ్నాయ దృష్టి కోణంతో విశ్లేషణ చేసే ప్రయత్నమిది. ఇందులో తారీఖులు, దస్తావేజుల వంటి వివరాల కంటే, ఏ నిర్దిష్టమైన భౌతిక పరిస్థితుల్లో ఈ సంక్షోభం తలెత్తిందీ, ఇది ఏ ఏ పాఠాలను నేర్పుతున్నదీ సంక్షిప్తంగా విశ్లేషించే ప్రయత్నమే ఇది.

1991 నాటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా సరీళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అమలులోకి వచ్చాయి. వీటినే ఎల్ పిజి (LPG) విధానాలని పిలిచేవారు. దశాబ్దాల నుండి సాగిన ప్రభుత్వ రంగంలోని వైఫల్యాలు, లోపాల ఆధారంగా పౌర సమాజంలో ప్రభుత్వ రంగం పట్ల వ్యతిరేకత, ప్రైవేటీకరణ పట్ల వ్యామోహాలను పెట్టుబడిదారీ వర్గం తమ మీడియా సాయంతో పథకం ప్రకారం సృష్టించింది. 1990 నుండి ఉనికిలోకి వచ్చిన ప్రైవేటీకరణ విధానం క్రమంగా కార్పొరేటీకరణ విధానంగా రూపొందింది. కార్పొరేటీకరణ కూడా స్థూలంగా ప్రైవేటీకరణ కోవలోకే వస్తుంది. కానీ ప్రైవేటీకరణ మొత్తం కార్పొరేటీకరణ క్రిందకి రాదు. ప్రైవేటీకరణ ప్రక్రియ ఒక నిర్ధిష్ట దశకు చేరితే కార్పొరేటీకరణగా పరివర్తన చెందుతుంది. కార్పొరేటీకరణ ప్రక్రియకి ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్ ఆర్ధిక శక్తులు వ్యవస్థీకృతమైనవి. వాటి ద్వారా ఏర్పడే కార్పొరేట్ వ్యవస్థ నాటి సర్కార్లను శాసించే స్థాయికి సైతం చేరుతుంది. మోడీ సర్కార్ సాగించిన పదకొండున్నర ఏళ్ళ పాలన కార్పొరేట్ వ్యవస్థను ఓ వ్యవస్థీకృత శక్తిగా మార్చడానికి సాధనంగా మారింది.

కార్పొరేటీకరణ దశకు చేరని కాలంలో తొలిదశ ప్రైవేటీకరణ విధానం సాగింది. అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకూ, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకూ ఆర్ధిక దన్నుగా నిలబడ్డ పెట్టుబడిదార్లకు కూడా గణనీయంగా అవకాశం కల్పించింది. అందులో కార్పొరేట్ల స్థాయికి ఆనాటికి ఎదగని పెట్టుబడిదారీ శక్తులు గణనీయంగా వుండేవి. కాంగ్రెసు హయాంలోనే క్రమక్రమంగా బలపడ్డ కార్పొరేట్లకు విశృంఖల లాభదాహం పెరిగింది. ఒక దశలో వారి ఆకలిని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తీర్చ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో ఫాసిస్ట్ ఆర్.ఎస్.ఎస్ అనుబంధ బిజెపి సర్కారును కార్పొరేట్ వ్యవస్థ అధికారంలోకి తెచ్చింది. ఆ తర్వాత కార్పొరేటు కంపెనీలు ప్రత్యేక అవకాశాలు పొందుతూ ఎదిగాయి. ఫలితంగా వ్యవస్థీకృత శక్తిగా కార్పొరేట్ వ్యవస్థ రూపొందింది. దీనితో కార్పొరేటేతర ప్రైవేటు పెట్టుబడిదారీ శక్తులకు ప్రైవేటీకరణ ప్రక్రియలో చోటు తగ్గింది. పైగా అవి గతంలో ప్రైవేటీకరణలో భాగంగా తమ స్వంతం చేసుకున్న ప్రభుత్వరంగ ఆస్థులకు కూడా భద్రత చేజారసాగింది. అంటే అవి కార్పొరేటేతర పెట్టుబడిదార్ల నుండి కార్పొరేటు సంస్థలకు బదిలీ కాసాగాయి. ఆ క్రమంలో ప్రభుత్వరంగ ఆస్థుల ప్రైవేటీకరణ అంటే, దాదాపు కేవలం కార్పొరేటీకరణ అనేదిగా మారింది. ప్రైవేటీకరణ విధానంలో ఇది రెండవ ఉపదశగా ఉనికిలోకి వచ్చింది.

క్రమంగా కార్పొరేటీకరణ పెరిగే క్రమంలో ఒక దశలో అది గుత్తాధిపత్యం దశకి చేరింది. ఆయా ఆర్ధిక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ఇటీవల క్రమంగా గుత్త సంస్థల ఏర్పాటుకు దారి తీస్తున్నది. టెలికాం, బీమా, పెట్రోలియం, సహజ వాయువు, సిమెంట్, ఉక్కు, విద్యుత్, బొగ్గు, ఖనిజ, లోహ, రవాణా, ఓడ రేవులు, విమానయానం వంటి ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క గుత్త సంస్థకు అప్పగించే ప్రక్రియ వ్యూహాత్మకంగానే మోడీ ప్రభుత్వం వేగవంతంగా చేపడుతున్నది. ఇండిగో సంస్థకు మొత్తం దేశీయ పౌర విమానరంగంలో 64 శాతం వాటాలు చిక్కడం కాకతాళీయ పరిణామం కాదు. ఇంత పెద్ద దేశానికి చెందిన విమానయాన రంగంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఒక్క కార్పొరేట్ సంస్థకు దక్కడం గమనార్హం. దీని వికృత ఫలితమే తాజా ఇండిగో సంక్షోభం.

స్వేచ్ఛా వాణిజ్య విధానంలో వుండే పోటీ గుత్త సంస్థల మధ్య వుండదు. అవి ఒకవైపు రాజ్య వ్యవస్థలను శాసిస్తాయి. మరోవైపు పోటీ వుండనందున ప్రయాణీకులను మరింత ఎక్కువ కొల్లగొడతాయి. అంతిమ పరిశీలనలో శ్రామిక, ఉద్యోగ వర్గాలను కొల్లగొడతాయి. ప్రస్తుతం జరిగింది యిదే!

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విమాన చోదకులైన పైలట్లకు కల్పించాల్సిన విశ్రాంతిని ఇండిగో ఇవ్వనిరాకరించింది. పైలట్ల భద్రత మీద ఆధారపడి ప్రయాణీకుల భద్రత వుంటుంది. వాటిపై ఆధారపడి ప్రభుత్వాల పాలనా అవకాశాలుంటాయి. ఈ వెలుగులో పైలట్ల విశ్రాంతి ప్రమాణాలను పాటించాలని మోడీ ప్రభుత్వం మార్గదర్శక ప్రమాణాలను (గైడ్లైన్స్) యిచ్చింది. అది తాజా సంక్షోభానికి మూల కారణం.

వంద బస్సు ప్రమాదాల కంటే; పది రైళ్ళ ప్రమాదాల కంటే; ఓ పౌర విమాన ప్రమాదం ప్రభుత్వాలను ఎక్కువ స్థాయిలో కుదిపివేస్తుంది. అందుకు కారణం ముందే చెప్పినట్లు ఆయా ప్రమాదాల బాధితులకు సమాజంలో వున్న స్థానాలే! రైళ్ళు, బస్ ప్రమాదాల నివారణ లేదా నియంత్రణల కోసం ప్రభుత్వాలు సహజంగా మొసలి కన్నీరు కార్చి వూరుకుంటాయి. లేదా నామమాత్ర భద్రతా ప్రమాణాలతో సరిపెడతాయి. కానీ, పౌర విమాన ప్రమాదాల పట్ల అలా నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదు. ప్రమాదాలలో మరణించిన మృతులకు పౌర సమాజంలో వుండే స్థానాలను బట్టి ఆయా ప్రభుత్వాల స్పందనలు, చర్యలు ఉంటాయని పేర్కొన్న విషయం గమనంలో వుండాలి. అందుకే లారీ, బస్, రైలు వంటి వాహనాల డ్రైవర్లు లక్షలాది మంది తమ విశ్రాంతి, భద్రతల కోసం ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయి. సరిగ్గా అదే స్థాయి నిర్లక్ష్యాన్ని పౌర విమాన చోదకుల (పైలట్ల) పట్ల ప్రదర్శించ లేవు. పైలట్ల విశ్రాంతి, భద్రత పట్ల ప్రభుత్వాలకు మానసిక సానుభూతి, ప్రేమలు లేకపోయినా, వ్యవస్థాపరంగా అవి స్పందించక తప్పదు. ఫలితమే పైన పేర్కొన్న విశ్రాంతి, భద్రతా ప్రమాణాలను ప్రభుత్వం జారీ చేసింది. వాటిని కూడా ఇండిగో సంస్థ పాటించడానికి ముందుకు రాలేదు. ఫలితమే ఇండిగో సంక్షోభం.

లక్షలాది మంది లారీ, ట్రక్, బస్, రైలు వంటి వాహనాల డ్రైవర్లు సమ్మెలు చేసినా, వాటి యజమాన్యాలు ఖాతరు చేయవు. పైగా వారిని తొలగించి పోటీ డ్రైవర్లని నియమించుకునే ప్రయత్నాలు చేస్తాయి. ఆ డ్రైవర్లకు పోటీగా రిజర్వుడు సైన్యం దొరుకుతుంది. విమాన చోదకులు (పైలట్లు) ఆ కోవలోకి రారు. అతి సుదీర్ఘ కాలంపాటు అత్యధిక ఖర్చు భరించి అత్యున్నత శిక్షణ పొందడం ద్వారానే పైలట్లు తయారవుతారు. అందుకే మిగిలిన కోవల వాహనాల చోదకుల (డ్రైవర్ల మాదిరిగా విమాన చోదకుల (పైలట్స్)ను స్థానభ్రంశం చేయడం సాధ్యం కాదు. ఈ కారణంగా కూడా పైలట్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి వుంది. అది ప్రభుత్వం సూచించిన మార్గదర్శక ప్రమాణాలలో దాగి వుంది. కానీ, విశృంఖల లాభదాహం గల కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలలో అది కూడా కరువైనది.

నిజానికి కార్పొరేటు ప్రభుత్వాలకూ, కార్పొరేట్ సంస్థలకూ మధ్య గుణాత్మక తేడా వుండదు. రాజకీయ రంగంలో ప్రభుత్వాలు గుత్తాధిపత్యాన్ని కోరితే, ఆర్ధికరంగంలో కార్పొరేట్లు గుత్తాధిపత్యాన్ని కోరడం జరుగుతుంది. రాజకీయ రంగంలో స్థల, కాలాల్ని బట్టి కొద్దిసార్లు కార్పొరేట్ సంస్థల ఆకాంక్షలకు కొంత భిన్నంగా కార్పొరేట్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా రాజకీయ రంగంలో తమ రాజకీయ గుత్తాధిపత్యాన్ని స్థిరీకరించుకోవడం కోసమే. సారాంశంలో మరింత ఫాసిస్టీకరణ చెందే క్రమంలో భాగమే. అయినా, పైలట్ల విశ్రాంతి కోసం మోడీ ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలను సహించలేక ఇండిగో సమ్మెకు దిగి ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడం గమనార్హం!

రాజకీయ రంగంలో గుత్తాధిపత్యం, ఆర్ధిక రంగంలో గుత్తాధిపత్యం సమాంతర ప్రక్రియలుగా సాగుతాయి. ఆర్ధిక రంగంలో కార్పొరేట్ శక్తులకు గుత్తాధిపత్యం స్థిరపడాలంటే, రాజకీయ రంగంలో ప్రభుత్వాలకు కూడా గుత్తాధిపత్యం స్థిరపడాలి. రాజకీయ రంగంలో గుత్తాధిపత్యం స్థిరపడాలంటే ఆర్ధిక రంగంలో గుత్తాధిపత్య ప్రక్రియకు ప్రభుత్వాలు దన్నుగా నిలబడాలి. ఈ రెండు ప్రక్రియల మధ్య పరస్పర సమన్యయం వుంటుంది. మున్ముందు నగ్నమైన టెర్రరిస్ట్ పాలన సాగించడానికి ఫాసిస్ట్ రాజ్య స్థాపన లక్ష్యంగా అవి ప్రయాణిస్తాయి. ఈ పరస్పర సమన్యయం మరియు సహకారంతో ప్రయాణించే ఫాసిస్ట్ రాజకీయ దారిలో చాలా అరుదైన సందర్భాలలో రాజకీయ మరియు ఆర్థిక విభాగాల మధ్య స్వల్ప వైరుధ్యాలు చోటు చేసుకునే అవకాశం వుంటుంది. దీనినే ఇండిగో సంక్షోభం వెల్లడించింది.

ఫాసిజాన్ని వ్యతిరేకించే రాజకీయ శక్తుల్లో స్థూల పరిశీలన ప్రకారం వర్గ పోరాట శక్తులు, వర్గ పోరాటేతర శక్తులు అనే రెండు కోవల వాళ్ళు వుంటారు. ఫాసిజానికి నిర్ణయాత్మక చోదక పాత్రను ఆర్ధిక ప్రాబల్య శక్తులు పోషిస్తాయని వర్గపోరాట శక్తులు భావిస్తాయి. రాజకీయ శక్తులే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని వర్గ పోరాటేతర రాజకీయ శక్తులు భావిస్తాయి. ఫాసిజం గూర్చి మార్క్సిస్ట్ రాజకీయ శక్తుల భాషకూ, మార్క్సిస్టేతర రాజకీయ శక్తుల భాషకూ మధ్య మౌలిక తేడా వుంటుంది. ఫలానా హిట్లర్ లేదా ముస్సోలినీ లేదా మోడీ ప్రభుత్వాల వల్లనే ఫాసిస్ట్ పాలన ఏర్పడి సాగుతున్నదనీ; వాటిని గద్దె దించితే ఫాసిస్ట్ పాలన పోతుందనీ మార్క్సిస్టేతర రాజకీయ శక్తులు భావిస్తాయి. ఆ ఫాసిస్ట్ ప్రభుత్వాలకు మూలాధారంగా ఫాసిస్ట్ ఆర్ధిక శక్తులు పోషించే నిర్ణయాత్మక పాత్రను అవి గుర్తించలేవు. అందుకు భిన్నంగా మార్క్సిస్ట్ రాజకీయ శక్తులు ఆర్ధికరంగం పోషించే నిర్ణయాత్మక పాత్రను గుర్తిస్తాయి. ఇది వాస్తవమని తాజా ఇండిగో సంక్షోభం వెల్లడించింది. ఇలా ఫాసిస్ట్ దారిలో ఒకే లక్ష్యంతో ఒకే గమ్యం వైపు సమాంతరంగా రాజకీయ, ఆర్థిక శక్తులు సాగించే ప్రయాణంలో అరుదుగా వాటి మధ్య మిత్ర వైరుధ్యాలు ఏర్పడతాయి. ఇలాంటి సందర్భాల్లో ఏ రంగాన్ని ఏ రంగం శాసిస్తుందో ఇండిగో సంక్షోభం చాలా స్పష్టంగా వెల్లడించింది.

వర్గ సమాజంలో ప్రభుత్వాలు వర్గ దోపిడీ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తాయని మార్క్సిజం చెబుతుంది. దోపిడీ వర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాటి నెహ్రూ ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ రంగం కూడా వర్గదోపిడీ పాలనా రూపాలలో ఒకటి. కానీ, అది కార్మికవర్గ సంక్షేమం కోసం తెచ్చిన సోషలిస్ట్ నమూనాగా ప్రచారం సాగింది. అది ఆచరణలో ప్రభుత్వరంగ కార్మికవర్గ వర్గపోరాట చైతన్యాన్ని మొద్దుబార్చింది. ఆనాటి స్థల, కాలాలను బట్టి వర్గదోపిడీ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ రూపాలలో ప్రభుత్వ రంగం ఒకటనే వర్గదృష్టి కమ్యూనిస్టులకు విధిగా వుండాలి. అది ఆనాడు భారత కమ్యూనిస్టు వుద్యమంలో కొరవడింది. ఫలితంగా ప్రభుత్వరంగ కార్మికవర్గం దేశ కార్మిక వర్గానికి దిశా నిర్దేశం చేసే మార్గదర్శక పాత్రను పోషించలేక పోయింది. 1950 దశాబ్దంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నాడని అనుకుందాం. ఆయన ప్రభుత్వ రంగాన్ని స్థాపించే పాత్ర పోషించి తీరాల్సి వుంటుంది. 1990 దశాబ్దంలో నెహ్రూ ఒకవేళ జీవించి పాలన సాగించాడనుకుందాం. ప్రైవేటీకరణ ప్రక్రియకు సారధిగా వుండేవాడు. అలాంటి స్థల, కాలాల ఆధారంగా చారిత్రక భౌతికవాద దృక్కోణంతో రాజకీయ పరిణామాల్ని మార్క్సిస్టులు విశ్లేషణ చేస్తారు. అందుకు పూర్తి భిన్నంగా రాజకీయ రంగంలో పాలకులను లేదా పార్టీలను కేంద్రంగా చేసుకొని మార్క్సిస్టేతర రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు సాగుతాయి. ఆ కాలంలో భారత కమ్యూనిస్టు వుద్యమం మీద మార్క్సిస్టేతర వర్గ సంకర రాజకీయ ప్రభావం పడింది. ఫలితంగా, కార్మిక వర్గంలో ప్రభుత్వ రంగం ఓ మినీ సోషలిస్ట్ రంగమనీ లేదా అదొక ప్రత్యామ్నాయ నమూనా అనే భ్రమలు ఆనాటి ప్రభుత్వరంగ శ్రామిక వర్గంలో పెరిగాయి. ఆ భ్రమల వల్ల 1990 లో ప్రైవేటీకరణ ఉనికిలోకి వచ్చినపుడు ప్రధానంగా ప్రభుత్వరంగ కార్మికవర్గం తీవ్ర నిరాశకు గురైనది. తమ ఊహజనిత స్వర్గం కూలినట్లు తల్లడిల్లింది. అది మరో రూపంలో పునరావృతమయ్యే స్థితి నేడు ఏర్పడింది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఆర్ధిక రంగంలో కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా తలెత్తిన నేటి పరిస్థితిని చూసి పైలట్ల ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వరంగ పునరుద్ధరణ కోసం తలెత్తిన నిరసనగా భ్రమలకు గురయ్యే మరో ప్రాతిపదిక ఏర్పడుతోంది. అలా గురికారాదు. ఇది నిజానికి ప్రైవేటీకరణ ప్రక్రియ స్థిరీకరణ కోసం జరుగుతుందనే చేదు నిజాన్ని కమ్యూనిస్టు శక్తులు మరిచిపోరాదు.

ఆడమ్ స్మిత్, రికార్డో, జేమ్స్ మిల్స్, కీన్స్ వంటి బూర్జువా ఆర్ధికవేత్తల విశ్లేషణల్లో ఒక సత్యం బోధపడుతుంది. అదే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛా పోటీ, గుత్త విధానం అనే రెండు రూపాలుంటాయనేది. పెట్టుబడిదారీ సంస్థల మధ్య ప్రజాస్వామ్యం వుండాలా? వద్దా? అనేదే సారాంశం. గుత్తాధిపత్య విధానంలో కార్పొరేట్ సంస్థల మధ్య కూడా ప్రజాస్వామ్యం వుండదు. ఉదాహరణకు వర్తమాన భారతదేశంలో అంబానీ, ఆదానీ వంటి గుత్త సంస్థల పక్షానే మోడీ ప్రభుత్వం నిలబడింది. సమస్త కార్పొరేట్ శక్తుల తరఫున ప్రాతినిధ్యం వహించడం లేదు. పౌర విమానయాన రంగంలో గుత్తాధిపత్యాన్ని సాధించిన ఇండిగో సంస్థ యాజమాన్యం పైలట్లను తన లక్ష్యంగా చేసుకొని ప్రయాణీకులపై దాడికి దిగింది. దీనిపై నేడు వెల్లువెత్తుతోన్న నిరసన మున్ముందు గుత్తాధిపత్య ధోరణిని వ్యతిరేకించే నిరసనోద్యమంగా రూపొందడానికి బీజం వేసింది. ఇది స్థూలంగా సానుకూల అంశమే. కానీ ఇదో బూర్జువా ప్రజాతంత్ర ధోరణిగా భావిచాల్సింది. ప్రాధమికంగా దాని లక్ష్యం పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను నెరవేర్చేదే. కార్పొరేట్ సంస్థల మధ్య పారదర్శక ప్రమాణాల్ని నెలకొల్పడం కోసమే. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రభుత్వ రంగంతో ప్రారంభమై కగార్ పేరిట అడవుల వరకూ బడా కార్పొరేట్లు కబ్జా చేసే విధానాన్ని వ్యతిరేకించే నేటి నిజమైన ప్రజాతంత్ర దృష్టితో వెల్లువెత్తే నిరసన కాదిది. కబ్జా చేసిన లేదా చేయనున్న దేశప్రజల ఆస్తులను కార్పొరేట్ల మధ్య పారదర్శకంగా పంపిణీ జరగాలంటూ సాగే నిరసనోద్యమమిది. సారాంశంలో కార్పొరేట్ ప్రజాస్వామ్యం కోసం తప్ప, పీడిత ప్రజల ప్రజాస్వామ్యం కోసం కాదు. ఈ మార్క్సిస్ట్ దృష్టికోణాన్ని వర్గపోరాట శక్తులు విస్మరించరాదు. తాజా ఇండిగో సంక్షోభం తర్వాత పౌరసమాజంలో వెల్లువెత్తుతోన్న నేటి నిరసనోద్యమం వెనక చోదకశక్తుల్ని మార్క్సిస్ట్ దృష్టికోణంతో వర్గపోరాట రాజకీయ శక్తులు సరిగ్గా విశ్లేషణ చేసి అంచనా వేయాల్సి వుంది.

ఈ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన కొత్త రూపం తీసుకోవడానికి ఒక భౌతిక ప్రాతిపదికను ఏర్పరుస్తున్నట్లు వారం రోజుల పరిణామాలను బట్టి అర్ధం అవుతున్నది. అందులో బూర్జువా ప్రజాస్వామ్య కోణం వున్నమాట నిజమే. గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా సాగే వుద్యమంలో మౌలికంగా పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలే వుంటాయి. అయినా, శ్రామికవర్గం దానిని తమ వర్గపోరాట పురోగమనానికి సద్వినియోగం చేసుకోవాలని ఒక సందర్భంలో లెనిన్ అన్నాడు. అయితే భ్రమలకు గురికాకుండా జాగ్రత్త పడాలని కూడా హెచ్చరిస్తాడు. లెనిన్ హెచ్చరిక వెలుగులో మార్క్సిస్ట్ దృష్టితో శ్రామికవర్గాన్ని భ్రమలకు గురికానివ్వకుండా చైతన్యపరచడం కమ్యూనిస్టుల రాజకీయ కర్తవ్యం.

ప్రభుత్వరంగ ఆస్థులు సాంకేతికంగా ప్రైవేటు పెట్టుబడిదార్లకు చెందని మాట నిజమే. పైగా అవి సాంకేతికంగా ప్రజల సంపద క్రిందికే వస్తుంది. అయినంత మాత్రాన అవి ఆచరణలో ప్రజల సొత్తు కాదు. అవి సారాంశంలో ప్రభుత్వ సంపదగానే వినియోగంలో వుంటుంది. ప్రభుత్వం దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని అంటే, ప్రభుత్వరంగం కూడా దోపిడీవర్గానికే చెందుతుంది. అయితే, వ్యక్తిగత దోపిడీదార్లకు చెందదు. ఆచరణలో అది దోపిడీవర్గ సమిష్టి సంపదగా వినియోగంలో వుంటుంది. నిజానికి వర్గ దోపిడీ వ్యవస్థలో దోపిడీ వర్గాల సమిష్టి ఆస్థులను వ్యక్తిగత దోపిడీదార్లకు అప్పగించే ప్రక్రియనే ప్రైవేటీకరణ అంటారు. ఇండిగో సంక్షోభం మీద నేడు వెల్లువెత్తుతున్న నిరసనోద్యమ లక్ష్యం తిరిగి ప్రభుత్వరంగ స్థాపన కాదు. అంటే, తిరిగి జాతీయీకరణ చేయడం కాదు. కనీసం రాష్ట్రాలు లేదా ప్రాంతీయ పెట్టుబడిదార్లకు కూడా ప్రైవేటీకరణ ప్రక్రియలో చోటు వుండాలనే లక్ష్యం కోసం కూడా కాదు. దేశ ప్రజల నుండి కొల్లగొట్టిన ఆస్థుల్ని విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్ కంపెనీల మధ్య సమధర్మంలో పారదర్శకంగా పంపిణీ చేయాలని మాత్రమే. ఈ దృష్టితో దేశ ప్రజలను, ముఖ్యంగా శ్రామిక వర్గాన్ని చైతన్యపరచడం కమ్యూనిస్టుల రాజకీయ కర్తవ్యం. తద్వారానే వర్గ పోరాటాలను తీవ్రం
చేయడం సాధ్యం అవుతుంది. తాజా ఇండిగో సంక్షోభం అందిస్తున్న రాజకీయ గుణపాఠమిది.

సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎంత తీవ్రస్థాయిలో పెరిగితే, ఇండిగో సంక్షోభం తరహా పరిణామాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తాయి. వాటి తీవ్రత, విస్తృతి, లోతులు కూడా వాటికి అనులోమానుపాతంలో పెరుగుతాయి. తుఫాన్ ముందు హెచ్చరిక వంటిదే ఈ సంక్షోభం. రానున్న కాలం ఎంత తీవ్ర సంక్షోభమయంగా వుంటుందో ఇదొక సూచికగా భావించాలి. వర్గపోరాటాలకు రానున్న కాలంలో ప్రాసంగికత మరింత చేకూరబోతున్న నిజాన్ని చాటిచెప్పడానికి ఇదో నిదర్శనం. రానున్న కాలంలో అట్టి సంక్షోభాల భారాలను ప్రధానంగా పీడిత, తాడిత ప్రజలు, ముఖ్యంగా శ్రామికవర్గం మోయాల్సి వస్తుంది. వాటికి వ్యతిరేకంగా రేపు తీవ్రం చేయాల్సిన వర్గ పోరాటాల ఆవశ్యకతను తాజా ఇండిగో సంక్షోభం సూచిస్తున్నది.

కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలను తిరిగి చట్టబద్దంగానే కాలరాసే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ని తీసుక వచ్చింది. వాటి అమలుకు 21.11.2025న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటికి కొత్త నిబంధనల్ని రూపొందించాల్సిన కొన్ని లాంఛన ప్రాయ చట్టబద్ధ ప్రక్రియలు మిగిలాయి. అవి పూర్తిచేసుకొని మరికొన్ని నెలలలో వాటి ఆచరణాత్మక అమలు ప్రారంభం కానున్నది. ఈ లేబర్ కోడ్ లు హరించే హక్కులు, సౌకర్యాలలో పనిగంటల అంశం ఒకటి. ఈ అంశం కేంద్రంగా తాజా ఇండిగో సంక్షోభం ప్రారంభమైనది.

శ్రామికవర్గానికి ఆర్ధిక జీవితంతో పాటు సాంఘిక, మానసిక జీవితాలు కూడా వుంటాయి. శ్రామిక కుటుంబాలు జీవించడానికి జీతభత్యాల వంటి తక్షణ అత్యవసరాలు వుంటాయి. కానీ అవి మాత్రమే సరిపోవు. సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా జీవించగలిగే సాంఘిక జీవితం కూడా అవసరమైనది. పై రెండు రకాల జీవితాలు ఫలప్రదంగా వున్నాయనడానికి వారి మానసిక జీవితం కొలబద్దగా వుంటుంది. కార్మిక కుటుంబాలు మానసికంగా సంతృప్తికర సంతోషకర జీవితాన్ని సాగించగలగాలి. వారి మానసిక జీవితానికి విశ్రాంతి ముఖ్యమైనది. 24 గంటల దినంలో 8 గంటలు నిద్రకోసం, 8 గంటలు కుటుంబాలతో వినోదం కోసం, 8 గంటలు పనికోసం అమలు జరగాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి క్రమంలో నిజానికి పనిగంటలు క్రమంగా తగ్గుతూ పోవాలి. 8 గంటల పనిదినం క్రమంగా 6 గంటల, 5 గంటల, 4 గంటల పనిదినంగా మారాలి. అందుకు బదులు పనిగంటలు పెంచుతున్న పరిస్థితి వుంది. దీనికి నిదర్శనం ఇండిగో సంక్షోభం. ఇది సారాంశంలో శ్రామికవర్గ, సాంఘిక, మానసిక జీవిత వ్యవస్థలపై దాడి!

నేడు వేలాది పౌర విమానాలలో (దేశీయ, అంతర్జాతీయ) లక్షలాది మంది శ్రామికులు పని చేస్తున్నారు. ఇందులో ప్రావిణ్యం లేని (అన్ స్స్కిల్డ్) కార్మికుల సంఖ్య అతి స్వల్ప శాతమే. 90 శాతం మందికి పైగా నిపుణులైన పనివాళ్ళే! ఇందులో అర్ధ నిపుణ (సెమీస్కిల్డ్) కార్మికులు కూడా చాలా తక్కువ శాతం మందే వున్నారు. ప్రధానంగా నిపుణ (స్కిల్డ్), ఉన్నత నిపుణ (హైస్కిల్డ్), పరమోన్నత నిపుణ (సూపర్ స్కిల్డ్) కోవలకు చెందిన కార్మిక, ఉద్యోగులే వున్నారు. వీరి నిపుణ శ్రమలు లేకుండా విమానాలు గాలిలోకి ఎగరలేవు. విమాన ప్రయాణీకులను వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చలేవు. అట్టి నిపుణ శ్రామికవర్గం పై ఆధారపడి కార్పొరేట్, బ్యూరాక్రాట్, పొలిటికల్, కమర్షియల్ వ్యవస్థలు మనుగడ సాగిస్తున్నాయి. కానీ, వాటన్నింటి మనుగడకు కారకులైన నిపుణ శ్రామిక కుటుంబాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఫలితంగా, మున్ముందు తీవ్ర ప్రతిఘటనను
చవిచూడాల్సిన కొత్త భౌతిక పరిస్థితి ఏర్పడక తప్పదు. ఇండిగో తాజా సంక్షోభం అందుకొక దారిని చూపుతుంది.

నెలకు 16 నుంచి 18 వేల రూ॥ల జీతాలతో గ్రౌండ్ సిబ్బంది ఆర్థిక జీవితాలు అత్యంత దుర్భరమైనవి. ఆర్థిక జీవితాలు ఎలా వున్నా, సాంఘిక జీవితాలు బాధామయంగా కొనసాగే క్యాబిన్ క్రూ సిబ్బందిది మరోరకం దుర్భరమైనది. ఉన్నత, పరమోన్నత నిపుణ కోవలకు చెందిన ఇంజనీర్లు, పైలట్ల మానసిక జీవితాలు సుఖశాంతులు లేనివే. ఈ రకరకాల బాధామయ విషాద బ్రతుకులు గడిపే శ్రామికవర్గమే విమానాలు ఆకాశంలో అత్యంత ఎత్తుకు ఎగరడానికి సుత్రధారులు, పాత్రధారులు కావడం గమనార్హం! కానీ వారి ఆర్థిక, సాంఘిక, మానసిక జీవితాలు మాత్రం పాతాళంలోకి దిగజారుతున్నాయి. సమాజంలో ఆర్థిక అసమానతలు క్రమంగా తీవ్రతరం అవుతున్నట్లే, విమానయాన రంగ యాజమాన్యాలకూ, శ్రామికవర్గానికీ మధ్య అంతరాలు కూడా నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఇది అనివార్యంగా రానున్న కాలంలో విమానయాన రంగంలో సైతం వర్గ పోరాటానికి భౌతిక ప్రాతిపదికను ఏర్పరచి తీరుతుంది.

సరిగ్గా 44 ఏళ్ళ క్రితం తే.19.01.1982న చరిత్రాత్మక దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె జరిగింది. ఆ సందర్భంగా బొంబాయి ఎయిర్ ఇండియా పైలట్లతో అర్ధరాత్రి 12 గంటలకు దేశవ్యాప్త సమ్మె ప్రారంభమైనది. అది నాటి దేశ కార్మికవర్గానికి చాలా స్ఫూర్తినిచ్చింది. చరిత్ర పునరావృతం కావడానికి ఆనాటి కంటే నేడు భౌతిక ప్రాతిపదిక ఏర్పడుతున్నది. ఆనాటి కంటే వందల రెట్ల సంఖ్యలో పైలట్లతో సహా విమానయాన సిబ్బంది పెరిగింది. పైగా వారి సాంస్కృతిక, సాంకేతిక జ్ఞాన సంపద పెరిగింది. వారు వ్యవస్థీకృత కార్మిక సేనగా రూపొందడానికి వస్తుగత భౌతిక పునాది ఏర్పడింది. ఆ కార్మికవర్గం కూడా సంఘటితమై తమ ఆర్థిక, సాంఘిక, మానసిక జీవితాలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో నడుం బిగిస్తే, అదొక రాజకీయ శక్తిగా రూపొందే అవకాశం వుంది. చరిత్ర గమనం ఏ మలుపులు ఎప్పుడు ఎలా తిరుగుతుందో కదా! ఆకాశంలో విమానాలు నడిపే పైలట్లు పోరాట బాట పడితే నేల మీద పారిశ్రామిక, సేవారంగ కార్మికవర్గానికి ఎంతటి ఉత్తేజాన్ని ఇస్తుందో కదా! అది దేశ కార్మికవర్గానికి రానున్న కాలంలో స్ఫూర్తిదాత పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం. వారిని సంఘటితం చేయడానికి ఇండిగో సంక్షోభం కారకంగా పనిచేస్తుందని ఆశిద్దాం!

(9-12-2025న రచించి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పక్షపత్రిక ‘ప్రజాపంథా’ డిసెంబర్ 16-31 సంచికలో ప్రచురించిన వ్యాసమిది)

Latest News