JNUSU | బీహార్ ఎన్నికల బరిలో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు

నేటి విద్యార్థి నాయకులే రేపటి భారత నేతలు అని నిరూపిస్తున్నాడు ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఏఐఎస్‌ఏ జాతీయ నాయకుడు ధనంజయ్‌.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

JNUSU | జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌ (JNUSU) మాజీ అధ్యక్షుడు, AISA జాతీయ నాయకుడు ధనంజయ్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా గోపాల్గంజ్ జిల్లాలోని భోర్ నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు. గయకు చెందిన ఒక దళిత కుటుంబంలో జన్మించిన ధనంజయ్ ప్రస్తుతం జేఎన్‌యూలో థియేటర్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరుగురు సంతానంలో చిన్నవాడు అయిన ధనంజయ్ తండ్రి రిటైర్డ్ పోలీసు అధికారి, తల్లి గృహిణి. ఆయన రాంచీలో పాఠశాల విద్యను పూర్తిచేసి, ఢిల్లీలోని ఆరబిందో కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం అంబేద్కర్ యూనివర్సిటీ, ఢిల్లీలో మాస్టర్స్ చేశారు.

ధనంజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థి కౌన్సిలర్‌గా ప్రారంభించి, ఆపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) లో వివిధ స్థాయిల్లో ఎదిగారు. AISA సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ విద్యార్థి విభాగంగా పని చేస్తోంది. గత సంవత్సరం ధనంజయ్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత జేఎన్యూలో మొదటి దళిత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జేఎన్యూఎన్‌యూలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ధనంజయ్ ఫెలోషిప్ స్టైఫండ్‌ల పెంపు, అధ్యాపక నియామకాల్లో ఉన్న భావజాల పక్షపాతం వంటి అంశాలపై పోరాడాడు.

బీహార్ ఎప్పటినుంచో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీకి కీలక స్థావరంగా ఉంది. రైతు ఉద్యమాలు, దళిత-పేదల హక్కుల కోసం సాగిన నక్సల్బరీ వారసత్వ పోరాటాల నుంచి వచ్చిన ఈ పార్టీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా బలాన్ని కలిగి ఉంది. ఇటీవల కాలంలో ఈ పార్టీ అసెంబ్లీకి గణనీయంగా ప్రతినిధులను పంపుతూ, ప్రజా సమస్యలపై బలమైన స్వరాన్ని వినిపిస్తోంది. ఈ సందర్భంలో ధనుంజయ్ లాంటి యువ, చదువుకున్న, ప్రగతిశీల నాయకుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగడం పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త తరహా ప్రజా ఆధారాన్ని ఇస్తున్నది. బీహార్‌లో బలమైన స్థానం కలిగిన సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా యువతలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు కృషి చేస్తోంది.

ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ పార్టీ కి 12 మంది శాసన సభ్యులు, ఒక్కరు శాసన మండలి సభ్యులు, ఇద్దరు లోకసభ సభ్యులు ఉన్నారు. కాగా, బీహార్‌లో ఓటింగ్ రెండు దశల్లో జరుగనుంది. నవంబర్ 6, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఫలితాలను ప్రకటించనున్నారు.