నాగపూర్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందూత్వంపై సంచలన వాఖ్యలు చేశారు. గురువారం నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 139 వ్యవస్థాపక ఉత్సవాల్లో మాట్లాడుతూ హిందువుకు, హిందూత్వకు చాలా తేడా ఉన్నదన్నారు. మన ఊర్లల్లో రామ మందిరాలను మనం నిర్మించలేదా? మనం రామున్ని నమ్మడంలేదా? అని ప్రశ్నించారు. రాముని భజనల్లో తాను కూడా పాల్గొనే వాడినని తెలిపారు. తాను కూడా హిందువునేనని అన్నారు. కానీ బీజేపీ మాత్రం హిందూత్వం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. భారత దేశ స్వాత్యంత్ర సమరంలో ఆరెస్సెస్, బీజేపీ, జనసంఘ్, సంఘ్ పరివార్ నుంచి ఒక్కరు కూడా బ్రిటీష్ వారిపై ఏనాడూ పోరాటం చేయలేదని మండిపడ్డారు. ఆరెస్సెస్ బ్రిటిష్ హయాంలో ఏర్పాటైన సంస్థని ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం సిద్దరామయ్య.
గతంలో కూడా సిద్దరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను హిందువునే కానీ.. హిందువులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. కాకపోతే హిందూత్వానికి వ్యతిరేకమన్నారు. అయోధ్యలో రాముని గుడి నిర్మించడం పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. హిందూ మతంపై తనకు నమ్మకమున్నదన్నారు. కానీ బీజేపీ మాత్రం హిందూ మతాన్ని రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. భారత రాజ్యాంగానికి అన్ని మతాలూ సమానమేనని ఆయన పేర్కొన్నారు. హిందూత్వం పేరిట హింసను ప్రేరేపిస్తున్నారని సిద్ధరామయ్య విమర్శించారు.