MUDA scam । ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను (Siddharamaiah) విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినప్పటికీ.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోరని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D K Sivakumar) చెప్పారు. గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఆయన రాజీనామా చేసే సమస్యే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధరామయ్య పక్షాన నిలిచి ఉందని తెలిపారు. ‘గవర్నర్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర (conspiracy) జరుగుతున్నది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే ప్రసక్తే లేదు. యావత్ పార్టీ, ప్రభుత్వం ఆయన వెంటనే ఉన్నాయి’ అని విధాన సభ (Vidhana Soudha) వద్ద డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు. బీజేపీ ఒత్తిడి రాజకీయాలకు ముఖ్యమంత్రి. తలొంచే ప్రసక్తే లేదన్నారు. సిద్ధరామయ్యకు ఇండియా కూటమి (INDIA bloc) మద్దతు ఉన్నదని, ఆయనపై తప్పుడు కేసులను న్యాయంగా, రాజకీయంగా ఎదుర్కొంటామని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) డిమాండ్‌కు ఆయన పై విధంగా స్పందించారు.
ఒక ఓబీసీ నాయకుడు రెండోసారి ముఖ్యమంత్రి కావడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నదని ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ చర్యలు గమనిస్తే అర్థమవుతున్నదని శివకుమార్ విమర్శించారు. ఇటువంటివాటికి కాంగ్రెస్ భయపడబోదని చెప్పారు. ఇదే తరహా కేసులలో కొందరు బీజేపీ నేతల ప్రమేయం (similar cases involving BJP leaders) ఉన్నదని ప్రాథమిక దర్యాప్తులో తేలినా వారిపై విచారణ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ‘ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని విచారించేందుకు 23.11.2023న లోకాయుక్త (Karnataka Lokayukta) రాష్ట్ర గవర్నర్ అనుమతిని కోరింది. ఇదే లోకాయుక్త 09.12.2021న మాజీ మంత్రి శశికళ జోల్లేను విచారించేందుకు అనుమతి కోరింది. గాలి జానర్దన్‌రెడ్డిని విచారించేందుకు 13-05-2024న, మాజీ మంత్రి మురుగేశ్ నిరానిని విచారించేందుకు 09-12-2020న అనుమతి కోరింది. ఈ అన్ని కేసులలోనూ ప్రాధమిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే గవర్నర్ అనుమతిని లోకాయుక్త కోరింది’ అని డీకే శివకుమార్ వివరించారు. గవర్నర్ చర్యలను నిరసించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.