Arvind Kejriwal । ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తన నిజాయితీని ధృవీకరించిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడతానని తెలిపారు. ‘మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మేం ప్రజా కోర్టు వెళతాం’ అని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో ఆప్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 ఫిబ్రవరికి బదులు 2024 నవంబర్‌లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ‘సుప్రీంకోర్టు విధించిన షరతుల కారణంగా మేం పనిచేయలేమని కొందరు చెబుతున్నారు. నేను నిజాయితీ పరుడిని అని మీరు భావిస్తే నాకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయండి. మళ్లీ ఎన్నికైన తర్వాత మాత్రమే నేను సీఎం కుర్చీలో కూర్చుంటాను. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికలతోపాటే నవంబర్‌లో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నా. ఎన్నికలు అయ్యేదాకా పార్టీ నుంచి మరొకరు ముఖ్యమంత్రిగా ఉంటారు. రెండు మూడు రోజుల్లో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం’ అని కేజ్రీవాల్ చెప్పారు.
ఆప్‌ను చీల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. వారు తన నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీయాలని ప్రయత్నించారని, కానీ అందులో విఫలమయ్యారని అన్నారు. ‘వాళ్లు పార్టీని చీల్చాలనుకున్నారు. కేజ్రీవాల్ ధైర్యాన్ని, నైతికతను దెబ్బతీయాలనుకున్నారు. వాళ్లొక ఫార్ములాను పెట్టుకున్నారు. పార్టీలను చీల్చడం, ఎమ్మెల్యేలను చీల్చడం.. నాయకులను జైళ్లకు పంపడి. కేజ్రీవాల్‌ను జైలుకు పంపడం ద్వారా ఢిల్లీలో వాళ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ.. వాళ్లు పార్టీని చీల్చలేక పోయారు. పార్టీ కార్యకర్తలను కూడా చీల్చలేకపోయారు’ అని కేజ్రీవాల్ అన్నారు.
జైల్లో ఉన్న కాలంలో ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో వివరించిన కేజ్రీవాల్.. ‘దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అనుకున్నానని, అందుకే రాజీనామా చేయలేదు.. వారొక ఫార్ములా పెట్టుకున్నారు. ఎక్కడైతే వారు ఓడిపోతారో.. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం’ అన్నారు.
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో మార్చి 11న అరెస్టయిన కేజ్రీవాల్‌కు గత వారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించకూడదని, ఎలాంటి అధికారి ఫైళ్లపై సంతకాలు చేయరాదని సుప్రీంకోర్టు షరతులు విధించింది. ఈ నేపథ్యంలో తన స్థానంలో మరో నేతను ముఖ్యమంత్రిగా నియమించాలని కేజ్రీవాల్ భావించారు.