Site icon vidhaatha

Bengaluru | బెంగళూరు పీజీ హత్య కేసు: కృతి కుమారిని అభిషేక్‌ ఎందుకు చంపాడు? దర్యాప్తులో తేలిందేంటి?

బెంగళూరు: బెంగళూరులో సంచలనం సృష్టించిన పేయింగ్‌ గెస్ట్‌ హౌస్‌లో హత్యోదంతంపై ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతి కుమారి (24) బెంగళూరులోని కోరమండలలో తాను ఉంటున్న పీజీ హాస్టల్‌లో జూలై 23న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే.. ఆమెతోపాటు ఉంటున్న యువతితో అభిషేక్‌కు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ యువతితో కొంతకాలంగా అతడికి విభేదాలు ఉన్నట్టు చెబుతున్నారు.

పోలీసులు, స్థానికులు చెబుతున్న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన కృతి కుమారి బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేది. అభిషేక్‌, ఆమె రూమ్మేట్‌ల వివాదంలో తరచూ జోక్యం చేసుకునేది. అతడిని దూరం పెట్టాలని సలహా ఇస్తుండేది. అభిషేక్‌, అతడి స్నేహితురాలి మధ్య గొడవలు పెరిగిన తర్వాత కృతికుమారి, ఆమె రూమ్మేట్‌ అభిషేక్‌ను దూరం పెట్టారు. ఆ తర్వాత ఆమె వేరే రూమ్‌కు మారేందుకు కృతి కుమారి సహాయం చేసింది. దీంతో బాధితురాలు నివసించిన పీజీ హాస్టల్‌ వద్ద అభిషేక్‌ కొంతకాలం క్రితం వచ్చి గొడవ చేసినట్టు సమాచారం. ఉద్యోగం చేయని అభిషేక్‌తో ఆమెకు గొడవ జరుగుతున్నదని, ఆమె తనకు దూరం కావడానికి కృతికుమారియే కారణమని భావించిన

అభిషేక్‌ అమెను చంపినట్టు అనుమానిస్తున్నారు.

అభిషేక్‌ను పోలీసులు శనివారం భోపాల్‌లో అరెస్టు చేశారు. ట్రాన్సిట్‌ రిమాండ్‌పై అతడిని బెంగళూరుకు తీసుకువస్తున్నట్టు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బీ దయానంద చెప్పారు. కృతికుమారిని అభిషేక్‌ హత్య చేయడం వెనుక అతడి ఉద్దేశాలేంటో పోలీసులు అధికారికంగా చెప్పడం లేదు. అతడిని తీసుకొచ్చి, ప్రశ్నించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని దయానంద తెలిపారు.

ఈ దారుణ హత్యకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ శుక్రవారం ఇంటర్నెట్‌లో కనిపించింది. ఆ వీడియోలో నిందితుడు హాస్టల్‌ కారిడార్‌లోకి ఒక పాలిథిన్‌ బ్యాగ్‌తో నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. కృతి కుమారి గది వద్దకు చేరుకున్న అభిషేక్‌.. తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగానే ఆమెను బయటకు ఈడ్చాడు. ఆమె ఎంత పెనుగులాడినా వదలని అభిషేక్‌.. కత్తితో గొంతు కోయడమే కాకుండా.. యథేచ్ఛగా కత్తితో పొడిచాడు. ఆమె కుప్పకూలిపోయిన తర్వాత కూడా అభిషేక్‌ ఆమెను జట్టుపట్టుకుని కొత్తతో పొడిచి.. అక్కడి నుంచి పరారయ్యాడు. గొడవ జరుగుతున్న శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునే సరికే కృతి కుమారి చనిపోయింది.

Exit mobile version