Site icon vidhaatha

Viral Video | లాలూ కుమార్తె మీసా భారతి విలాసవంతమైన భవనం ఇదేనా? ఆమె రెస్పాన్స్‌ ఏంటి?

Viral Video | రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసేందుకు నకిలీ వీడియోలను వారి ప్రత్యర్థులు యథేచ్ఛగా వాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతికి చెందిన విలాసవంతమైన భవనం ఇదేనంటూ ఒక వీడియోతో కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక మహిళ విలాసవంతమైన భవనంలోని పడక గదులు.. ఇతర గదులను చూపిస్తుంటుంది. ఈ వీడియోను రోసీ అనే ఎక్స్‌ హ్యాండిల్‌ నుంచి వచ్చింది. ఆమెకు సుమారు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. లాలూ ప్రసాద్‌ పేద, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుమార్తె తన పెచ్చులూడిన ఇంటిని చూపిస్తున్నది.. అంటూ ఆ పోస్టు పేర్కొంటున్నది. దీనిపై మీసా భారతి వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్లీజ్‌ అడ్రస్‌ చెప్పరూ.. వెళ్లి చూడాలని ఉంది..’ అంటూ కామెంటారు. మీసా భారతి ఇంత క్లారిటీ ఇచ్చినా.. ఈ వార్త రాసే సమయానికి ఆ వీడియో ఇంకా డిలీట్‌ కాలేదు.

నిజానికి ఆ వీడియో అరబ్‌ నిర్మాణ తరహాలో ఉన్న విషయాన్ని పలువురు యూజర్లు ప్రస్తావించారు. అది మీసా భారతి ఇల్లు కాదని తేల్చి చెప్పారు. మీసా భారతి స్పందనతోనైనా దీని ఒరిజినల్‌ పోస్ట్‌ చేసిన యూజర్‌ దాన్ని వెంటనే డిలీట్‌ చేయాలని లేదా ఆమె కోరిన విధంగా అడ్రస్‌ అయినా ఇవ్వాలని కొందరు కోరారు.

లాలూ, రబ్రీదేవి దంపతులకు 1976 మే 22న మీసా భారతి జన్మించారు. కంప్యూటర్‌ ఇంజినీర్‌ అయిన శైలేశ్‌ కుమార్‌ను 1999 డిసెంబర్‌ 10న వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తన తల్లిదండ్రుల బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మీసా భారతి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పాటలీపుత్ర స్థానం నుంచి పోటీ చేసి సొంత పార్టీ తిరుగుబాటు అభ్యర్థి రామ్‌కృపాల్‌ యాదవ్‌ చేతిలో ఓటమి చవి చూశారు. తదుపరి 2016, 2022 రాజ్యసభ ఎన్నికల్లో ఆర్జేడీ ఎంపీగా ఎన్నికయ్యారు.

Exit mobile version