New Delhi National News/ August 20 :
Lok Sabha bills 2025 | ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం బుధవారం నాలుగు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. తొలుత ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025ని ప్రవేశపెట్టింది. అనంతరం రాజకీయ నేతల నేరాల నియంత్రణ బిల్లు-2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు 2025, రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్యనే ఆయన బిల్లులను ప్రవేశపెట్టి మూడు బిల్లులను జేపీసీకి పంపిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులు నేర నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ బిల్లు ప్రతులను చించి అమిత్ షాపైకి విసిరేశారు. ఇవేమీ పట్టించుకోకుండా అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టి వాటిని జేపీసికి పంపిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజకీయ నేతల నేరాలపై బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారి తీసే అవకాశం ఉందని విపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. దేశ సమాఖ్య విధానానికి ఇది విరుద్ధమని అన్నారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉండినట్టయితే వారు తమ పదవికి రాజీనామా చేయనప్పటికీ.. ఆటోమేటిగ్‌గా 31వ రోజున పదవిని కోల్పోతారని తాజా బిల్లు పేర్కొంటున్నది. అయితే.. అదే కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ సంబంధిత పదవులను చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం ఇస్తున్నది. ఈ బిల్లుల ప్రవేశ ప్రక్రియ పూర్తియైన కాసేపటికే సభ వాయిదా పడింది.
ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకే
ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న బిల్లు దుర్మార్గమైనదని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులపై తప్పుడు కేసులు పెట్టి, ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు ఈ బిల్లును దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపించాయి. ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తున్నట్టు అమిత్‌షా ప్రకటిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలను చించి, హోం మంత్రిపైకి విసిరారు. భారతదేశాన్ని పోలీస్ రాజ్యాంగా మార్చేందుకు ఈ బిల్లు తీసుకొస్తున్నారంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసలేని ఆరోపణలు, అనుమానాల ఆధారంగా కార్యనిర్వాహక ఏజెన్సీలు జడ్జీల అవతారం ఎత్తే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను సమాధి చేసే ప్రయత్నాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్మనీ నాజీ నియంత హిట్లర్‌కు సంబంధించిన రహస్య పోలీసు విభాగం గెస్టాపోతో ఈ బిల్లును ఒవైసీ పోల్చారు. రాజ్యాంగ మౌలిక వ్యవస్థను ఈ బిల్లులు తీవ్రంగా దెబ్బతీస్తాయని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి అన్నారు. ప్రభుత్వ సంస్థలు రాజకీయ దురుద్దేశాలతో దుర్వినియోగం అవుతున్నాయని ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు పదే పదే పేర్కొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆన్ లైన్ మోసాల నియంత్రణకే గేమింగ్ బిల్లు : కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్
తొలుత ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025ని ప్రవేశపెట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు పెరిగిపోయిన తరుణంలో ఈ బిల్లు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు బిల్లు అవకాశం కల్పిస్తుందన్నారు. రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా ఉంటుందని తెలిపారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారని పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లుని రూపొందించామని వివరించారు. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.. ఈ – స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌కు ప్రోత్సాహం, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై నిషేధం విధిస్తారని..ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ వంటి గేమ్స్‌పై నిషేధం విధిస్తారని వెల్లడించారు. యువత, కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నామన్నారు. ఈ బిల్లు ద్వారా ఈ – స్పోర్ట్స్‌కి అధికారిక గుర్తింపు, అలాగే శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. సోషల్, విద్యా గేమ్స్ అభివృద్ధికి కేంద్రం మద్దతు తెలుపుతోంది. తద్వారా భారతీయ విలువలతో వచ్చే గేమ్స్ ప్రోత్సాహం అందిస్తుంది. ఆన్‌లైన్ మనీ గేమ్స్ ప్రకటనలు, లావాదేవీలు నిషేధించి, బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్స్ బ్లాక్ చేస్తారు. కేంద్ర స్థాయిలో ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు చేస్తారు. డిజిటల్ ఇండియాలో సమతుల్యత, వినూత్నతకు ప్రోత్సాహం, సమాజ రక్షణకు ఈ బిల్లు పాటుపడుతుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పష్టం తెలిపారు.