విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గం యువతను నాశనం పట్టించాడని, మత్తు పదార్ధాలకు బానిసలను చేస్తున్నాడని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఓ మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి యువతకు ఆదర్శంగా నిలవాల్సిన రోహిత్ రెడ్డి వారిని వక్ర మార్గం పట్టిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ జీరో అవర్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ కేసును మనోహర్ రెడ్డి ప్రస్తావించారు.
పైలట్ రోహిత్ రెడ్డి సభ్య సమాజం తల దించుకునే విధంగా వ్యవహరించి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడని, అతడు కేవలం డ్రగ్స్ వినియోగదారుడిగా కాకుండా సరఫరాదారుడిగా కొనసాగుతున్నాడని, దేశ, అంతర్జాతీయ డ్రగ్ ముఠాలలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీ, ఏపీ, దుబాయ్ లోని వ్యక్తులతో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా అందులో రోహిత్ రెడ్డి ఉంటున్నాడని, ఆయన ఫామ్ హౌస్ నేరమయ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఇదే ఫామ్ హౌస్ లో జరిగిందని గుర్తు చేశారు. దుబాయ్ లో బిజినెస్ మెన్ కేదార్ అనే వ్యక్తి చనిపోయిన సందర్బంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నాడని గుర్తు చేశారు.
రోహిత్ రెడ్డి కేసులో మరింత లోతైన విచారణ చేస్తూ పెద్ద నాయకులు బయటపడే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలీసు అధికారులపై రోహిత్ రెడ్డి చేయి చేసుకున్నాడని తెలిపారు. మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఇవి కూడా చదవండి :
US Self Deportation Offer : అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ !
Indore EV Charge Blast :పేలిన ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్..8 మంది మృతి
