US Self Deportation Offer : అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. స్వచ్ఛందంగా దేశం విడిచివెళ్లే వారికి $2600 బోనస్‌తో పాటు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Mar 18, 2026, 4:04 pm IST
Read Time: 5 mins
US Self Deportation Offer : అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ !

విధాత : అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. స్వచ్ఛందంగా అమెరికాను వదిలివెళ్లే అక్రమ వలసదారులకు 2,600 డాలర్లు (రూ.2,40,329) ఎగ్జిట్‌ బోనస్‌ అందించనున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించింది. ఎగ్జిట్ బోనస్ ఆఫర్ తో జరిమానాల నుంచి మినహాయింపు కల్పిస్తామని, అలాగే వారిని స్వదేశాలకు విమానంలో ఉచితంగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

తాము స్వదేశానికి తిరిగివెళ్లేందుకు సిద్ధమేనని ‘సీబీపీ హోమ్‌’ యాప్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే వారి పేర్లను బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన వారి లిస్టు నుంచి తొలగిస్తామని ప్రకటించింది.

అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడానికి 2025 జనవరిలో అమెరికా చర్యలు ప్రారంభించినట్లు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. తాము ఇస్తున్న ఆఫర్‌లను వినియోగించుకొని.. అప్పటినుంచి ఇప్పటివరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగివెళ్లినట్లు వెల్లడించింది. స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వెళ్లడమే అక్రమంగా అమెరికాకు వచ్చినవారి ముందున్న అతి సురక్షితమైన,సులభమైన మార్గమని తెలిపింది. అలా చేస్తే అరెస్టు కాకుండా కూడా ఉండొచ్చని, గౌరవంగా స్వదేశాలకు వెళ్లవచ్చని పేర్కొంది.

సెల్ప్ డిపోట్ కార్యక్రమానికి పోస్టర్లతో ప్రచారం

భారత్‌తో సహా ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చిన వారిని, ఉచిత విమాన ప్రయాణం ద్వారా వారి స్వదేశాలకు పంపించడానికి, అదనంగా 2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్ కూడా అందిస్తామని అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) పోస్టర్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ తాజ్ మహల్ చిత్రాన్ని, అలాగే కొలంబియా, చైనాలకు చెందిన ప్రముఖ చారిత్రాక కట్టడాల చిత్రాలను ఉపయోగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలాన్ని ప్రారంభించిన తర్వాత గత ఏడాది మే నెల నుంచి ఈ పథకం ప్రారంభించబడింది. ఇది వలసదారులను ఎలాంటి నిర్బంధం లేదా బలవంతపు చర్యలు లేకుండా వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తుంది.

జనవరి 2025 నుండి ఇప్పటివరకు, 2.2 మిలియన్లకు పైగా పత్రాలు లేని వలసదారులు ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్ అని పిలువబడే కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న ఎగ్జిట్‌ బోనస్‌ పథకాన్ని వినియోగించుకున్నారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ప్రస్తుతం ఒక వ్యక్తిని బలవంతంగా దేశం నుండి పంపించడానికి అయ్యే ఖర్చు 18,245 డాలర్లుగా ఉందని, అదే సమయంలో స్వచ్ఛంద బహిష్కరణ పథకం కింద (ప్రోత్సాహక మొత్తంతో కలిపి) అయ్యే ఖర్చు సుమారు 5,100 డాలర్లు మాత్రమేనని ఆ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

Indore EV Charge Blast :పేలిన ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్..8 మంది మృతి
జర్నలిస్ట్ ల అక్రిడిటేషన్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్