Site icon vidhaatha

Maharashtra’s next chief minister । మహారాష్ట్ర సీఎం కుర్చీపై తొలగని ప్రతిష్ఠంభన.. నేడు బీజేపీ ఎమ్మెల్యేల కీలక భేటీ

Maharashtra’s next chief minister । ఏకులాంటి వాడనుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే.. మేకులా తయారవడంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు మోదీ, అమిత్‌ షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ఏక్‌నాథ్‌ షిండే.. మరోవైపు మహారాష్ట్ర ప్రజలు తననే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని బహిరంగంగానే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వని పక్షంలో కొన్ని డిమాండ్లను ఏక్‌నాథ్‌ షిండే బీజేపీ పెద్దలు ముందు ఉంచినట్టు తెలుస్తున్నది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర బీజేపీ నాయకత్వం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీలను మహారాష్ట్రకు పరిశీలకులుగా నియమించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటుతున్నా.. విజయం సాధించిన మహాయుతి (బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే) ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. డిసెంబర్‌ 3వ తేదీన బీజేపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకుంటారని తెలుస్తున్నది. సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతి 230 స్థానాలు గెల్చుకుని ఘన విజయం సాధించింది. మహాయుతిలో భాగస్వామ్య పక్షాలైన బీజేపీకి 132 సీట్లు లభించగా.. శివసేన 57, అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెల్చుకున్నాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే డిసెంబర్‌ 5వ తేదీన ముబైలోని ఆజాద్‌ మైదాన్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా హాజరవుతారని తెలుస్తున్నది.

ఘన విజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి ప్రత్యేకించి శివసేన ఆకాంక్షల విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నుకునే నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికే శివసేన, ఎన్సీపీ తమ శాసనసభా పక్ష నేతలుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌పవార్‌లను ఎన్నుకున్నాయి. డిసెంబర్‌ 5వ తేదీన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాత్రమే ప్రమాణం చేస్తారా? లేక మంత్రివర్గం ప్రమాణం కూడా ఉంటుందా? అనే అంశంలో నేతలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని మహాయుతి సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అసంతృప్తితో ఉన్నారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఏక్‌నాథ్‌ షిండే తన స్వగ్రామానికి వెళ్లిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. షిండే తన స్వగ్రామం నుంచే కథ నడిపిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఆదివారం ఆయన ముంబైకి చేరుకున్నారు. అంతకు ముందు గ్రామంలో మీడియాతో మాట్లాడిన షిండే.. ‘సీఎం పోస్టుపై బీజేపీ తీసుకునే నిర్ణయానికి నేను, శివసేన పూర్తిగా కట్టుబడి ఉంటామని ఇప్పటికే నేను చెప్పాను’ అని తెలిపారు.

Exit mobile version