Top Maoist Leader Ashanna Surrenders | చత్తీస్ గఢ్ సీఎం ముందు లొంగిన ఆశన్న టీమ్ 208మంది

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న (రూపేశ్) సహా 208 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు లొంగిపోయారు. ఆశన్నపై ఉమేశ్‌చంద్ర, మాధవరెడ్డి, చంద్రబాబులపై దాడుల కేసులతో పాటు పలు హత్యకేసులు నమోదయ్యాయి.

Top Maoist Leader Ashanna Alias Roopesh Surrenders

న్యూఢిల్లీ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు, రూపేష్ సహా 208మంది మావోయిస్టులు శుక్రవారం చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు సామాగ్రీని ప్రభుత్వానికి అప్పగించారు. దండకారణ్యం సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి రూపేష్ పేరుతో వ్యవహరిస్తున్న ఆశన్న అసలు పేరు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు. ఆశన్నతో పాటు లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుమాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, బస్తర్ డివిజన్ కార్యదర్శి రాజమన్,, 15మంది డివిజన్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. జగ్దల్పూర్‌లో జరిగిన లొంగుబాటు కార్యక్రమంలో మావోయిస్టులు 153 ఆయుధాలను సరెండర్ చేశారు. వీటిల్లో 19 ఏకే-47 రైఫిళ్లు, 17 ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిళ్లు, 23 ఇన్సాస్‌లు, 1 ఇన్సాస్‌ ఎల్‌ఎంజీ, 303 రైఫిళ్లు 36, 11 బీజీఎల్‌, 4 కార్బైన్‌లు, 41 బోర్‌ షాట్‌గన్‌లు, పిస్తోళ్లు ఉన్నాయి. 208 మందిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.

లొంగిపోయే ముందు ఆశన్న పార్టీ సహచరులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. సాయుధ పోరు చేస్తున్న సహచరులారా..నేను లొంగుబాటు నిర్ణయం తీసుకోవడం అందరికి నచ్చకపోవచ్చు..అయితే ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అంతా అర్దం చేసుకోవాలన్నారు. మీ భద్రతపై ఆందోళనగా ఉందని..ముందుగా మన ప్రాణాలు కాపాడుకోవాల్సి ఉందని..జీవించే ఉంటేనే ప్రజాపోరాటాలు కొనసాగించగలుగుతామన్నారు. జనజీవన స్రవంతిలోకి వెళ్లాక కూడా ప్రజాపక్ష భావజాల సైద్దాంతిక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లొంగుబాటు పిలుపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నాకు 62671 38163 నంబర్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

భారీ లొంగుబాట్లు

తాజాగా మరో కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ అభయ్‌తో పాటూ 61 మంది మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయారు. మొత్తంగా 300మంది వరకు మావోయిస్టులు ఈ వారం రోజుల్లో లొంగిపోవడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని..వారితో చర్చల ప్రసక్తేలేదని, లొంగిపోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో ఢీలా పడిన మావోయిస్టు పార్టీ కేడర్ లొంగుబాటు మార్గాలను ఎంచుకుంటుంది. జనవరి 2024 నుండి 2100 మంది నక్సలైట్లు లొంగిపోయారని..1785 మందిని అరెస్టయ్యారని, 477 మంది ఎన్ కౌంటర్ అయ్యారని తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

ఆశన్న ఉద్యమ ప్రస్థానం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం లక్ష్మీదేవిపేట. హన్మకొండలో పాలిటెక్నిక్‌ చదువుతూ రాడికల్‌ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తాలో 1999 సెప్టెంబర్ 4న ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌చంద్ర హత్య, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్‌కేసర్‌ దగ్గర బాంబు పేల్చి చంపిన కేసులో, 2003 అక్టోబర్‌1న తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబు నాయుడుపై క్లైమోర్ మెన్ దాడి కేసులో ఆశన్న నిందితుడిగా ఉన్నాడని పోలీసు రికార్డులలో పేర్కొన్నారు. . మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి హత్యకు 2003, 2007లో రెండుసార్లు దాడి చేశారన్న అభియోగాలు ఉన్నాయి. అలాగే, గడ్చిరోలిలో 2019లో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో 15 మంది మహారాష్ట్ర పోలీసులు చనిపోయిన ఘటనకు కూడా కీలక సూత్రధారి ఆశన్న అని పోలీసుల కథనం.

336జిల్లాల నుంచి 3జిల్లాలకు పరిమితమైన మావోయిస్టులు

గతంలో దేశంలోని 16 రాష్ట్రాల్లోని 336 జిల్లాలకు విస్తరించిన మావోయిస్టుల ప్రభావం.. ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైంది. పలు రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, సాయుధ విప్లవోద్యంలో తగ్గిన రిక్రూట్ మెంట్లు, పెరిగిన ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో పార్టీ మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. అడవుల్లో ప్రస్తుతం మావోయిస్టుల సంఖ్య కేవలం 200 వరకు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు మావోయిస్టుల కంచుకోట చత్తీస్ ఘఢ్ లో ఆపరేషన్ కగార్ దెబ్బకు అబూజ్ మడ్, మాడ్, ఉత్తర బస్తర్ డివిజన్ లోని కొండగావ్, దంతెవాడ, కాంకేర్ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోగా..దక్షిణ బస్తర్ డివిజన్ నారాయణ పూర్, సుక్మా, బీజాపూర్ జిల్లాలో మాత్రం మావోయిస్టుల కదలికలు ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీసగఢ్‌లో మావోయిస్టులో మిగిలిన అగ్రనేతలు హిడ్మా, పాపారావు, తిప్పరి తిరుపతి టార్గెట్‌గా కేంద్ర బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.