మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం.. క్యాబినెట్‌లో ఎవరెవరంటే…

వరుసగా మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన వేడుకలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు

  • Publish Date - June 9, 2024 / 07:46 PM IST

న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన వేడుకలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడోసారి ప్రధాని కావడం ద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు.

మోదీతోపాటు గత క్యాబినెట్‌లో ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌ తదితరులు మరోసారి మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం మోదీ కొత్త క్యాబినెట్‌లో భాగస్వామి కానున్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కూడా కొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్నారు. వీరితో కూడా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.

పోర్టుఫోలియోలు ఇంకా ప్రకటించనప్పటికీ.. గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించినవారికి వాటినే కొనసాగిస్తారని తెలుస్తున్నది.

ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్‌ మొహమ్మద్‌ ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ అలియాస్‌ ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్‌ విక్రమసింఘె, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగనాథ్‌, సీషెల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ ఆరిఫ్‌ తదితర దేశాధినేతలతోపాటు దేశంలోని పలువురు సీనియర్‌ రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లపై నమ్మకం పెట్టుకున్నా.. ప్రజలు మాత్రం 240 స్థానాలకు పరిమితం చేశారు. బీజేపీకి సొంతగా మెజార్టీ దక్కని నేపథ్యంలో పదేళ్ల తర్వాత దేశంలో మళ్లీ సంకీర్ణ యుగం మొదలైంది. ఎన్డీయే కూటమికి మొత్తంగా 293 సీట్లు దక్కాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి.

మోదీ ప్రమాణంలో మెరిసిన ‘తారలు’.. షారూఖ్‌ సహా ఎవరెవరు వచ్చారంటే..
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు, దర్శకులు హాజరై కొత్త మెరుపులు తెచ్చారు. ఒకవైపు దేశ, విదేశీ ప్రముఖులతోపాటు.. తారలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌, తమిళ సినీ దిగ్గజ హీరో రజనీకాంత్‌ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షారుఖ్‌ఖాన్‌ నల్లని దుస్తుల్లో రాగా, రజనీకాంత్‌ తెల్లని కుర్తా, పైజామా ధరించారు. మండీ నుంచి ఎంపీగా కూడా ఎన్నికైన కంగన రనౌత్‌, అనుపమ్‌ఖేర్‌, అక్షయ్‌కుమార్‌, భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌, తెలుగు సినీ హీరో, జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌, భోజ్‌పురి నటుడు, రాజకీయ నాయకుడు నిరాహువా, నటుడు మనోజ్‌ తివారి, రవీనాటాండన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేయడంతో దేశంలో మోదీ 3.0 పాలన మొదలైంది. అయితే.. బీజేపీకి ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. తమకు 370, ఎన్డీయేకు 400 పైనే వస్తాయని చెప్పినా.. బీజేపీకి సొంతగా మెజార్టీ కూడా దక్కలేదు. ఓటర్ల తిరస్కారంతో ఆ పార్టీ 240 సీట్లకు పరిమితమైంది. ఎన్డీయేకు మాత్రం 293 సీట్ల దక్కాయి.

                                                                                        భూపేందర్‌యాదవ్‌, పీయూష్‌ గోయల్‌, జేడీయూ మాజీ చీఫ్‌ రాజీవ్‌రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తదితరులు కూడా ప్రమాణం చేశారు.

Latest News