ఇప్పుడంతా ఆన్‌లైన్ ప్రపంచం. బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ప్రతి ఐటెం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకేముంది బిజీ లైఫ్ గడిపేవారు గడప దాటి బయటకు వెళ్లరు. అలాంటి వారు స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ ఐటెమ్‌ను ఫేమస్ హోటల్ నుంచి స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశాడు. కానీ ఆ యువకుడు చికెన్‌ను చూసి షాకయ్యాడు. ఎందుకంటే అందులో ఓ ట్యాబ్లెట్ స్ట్రిప్ కనిపించింది. బొద్దింకలు, బల్లులు, నత్తలు, ఇతర పురుగులు మాయమై ఇప్పుడు మెడిసిన్స్ ప్రత్యక్షమవుతున్నాయని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు.
ముంబైకి చెందిన ఉజ్వల్ పూరి అనే యువకుడు లియోపోల్డ్ కేఫ్ నుంచి స్విగ్గీ ద్వారా చికెన్ ఐటెమ్ ఆర్డర్ చేశాడు. ఇక ఆ ఆర్డర్ రానే వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి సగం వరకు తినేశాడు. ఆ తర్వాత రెండు ట్యాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ప్రత్యక్షమైంది. దీంతో సదరు యువకుడు షాక్ అయ్యాడు. రెండు మెడిసిన్స్‌తో ఉన్న ఆ స్ట్రిప్‌లో ఒకటి పూర్తిగా విచ్ఛిన్నమైంది. మరొకటి అలానే ఉంది. ఇక ఈ విషయాన్ని స్విగ్గీ దృష్టికి తీసుకెళ్లాడు ఉజ్వల్ పూరి. తక్షణమే స్విగ్గీ కూడా స్పందించింది. నేరుగా మీతో కాంటాక్ట్ అవుతామని పూరికి స్విగ్గీ సంస్థ సమాచారం ఇచ్చింది. అనంతరం ఇది వైరల్ అయింది.
గత కొన్నేండ్ల నుంచి లియోపోల్డ్ కేఫ్ సర్వీస్, నాణ్యత తగ్గిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. వంటలు సరిగా, పరిశుభ్రంగా చేయాలని కనీసం స్విగ్గీనైనా సదరు రెస్టారెంట్‌ను అడగాలని మరో యూజర్ అన్నాడు. ఇక ఆహార పదార్థాలను డెలివరీ చేసే ముందు వాటి రుచి, వాసన చూసిన తర్వాతనే డెలివరీ చేయాలని ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు. లియోపోల్డ్ కేఫ్‌లో పరిశుభ్రత పాటించడం లేదని, వంట గది కూడా అపరిశుభ్రంగా ఉందని ఓ నెటిజన్ అన్నాడు. సిబ్బంది కూడా పరిశుభ్రత పాటించడం లేదని తెలిపాడు.
ముంబైలోని కొలాబాలో ఉన్న లియోపోల్డ్ కేఫ్ ఫేమస్. లియోపోల్డ్ కేఫ్ లక్ష్యంగా 2008లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లియోపోల్ట్ కిటికీలు, గోడలపై ఇప్పటికీ బుల్లెట్ గుర్తులున్నాయి.