Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలో మరికొన్ని రూట్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా టాటానగర్ – పాట్నా మధ్య త్వరలోనే మరో రైలును పట్టాలెక్కించేందుకు సౌత్ ఈస్టర్న్ రైల్వేశాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ రైలు భోజుడిహ్, గోమో మీదుగా ఏడు గంటల్లోనే పాట్నాకు చేరున్నది. ఇందుకోసం టాటానగర్‌లో మేయింటనెన్స్ సెంటర్‌ను సైతం నిర్మిస్తున్నది. దాంతో పాటు మరికొన్ని మార్గాలపై సైతం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం టాటా నుంచి పాట్నా వెళ్లే రైళ్లు అసన్‌సోల్‌లో ఇంజిన్‌ను మార్చాల్సి రావడంతో సమయం వృథా అవుతున్నది.
కొత్త మార్గం ద్వారా సమస్య పరిష్కారం కానున్నది. ముఖ్యంగా ధన్‌బాద్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగనున్నది. అయితే, రైల్వేశాఖ అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలోనే కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. రైలు ఎనిమిది కోచ్‌లు ఉంటాయని.. వేగం 130 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రైలు నిర్వహణ బాధ్యత సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌పై ఉంటుంది. టాటానగర్‌లో నిర్వహణ కేంద్రాన్ని నిర్మిస్తుండగా.. పాట్నాలోని పాట్లీపుత్ర కోచింగ్ కాంప్లెక్స్‌లో ప్రాథమిక మరమ్మతు పనులు జరగనున్నాయి. సెమీ హైస్పీడ్ రైలు టాటానగర్, పురూలియా, అనరా, భోజుదిహ్, మహుదా, గోమో, కోడెర్మా, గయా, జెహనాబాద్ మీదుగా పాట్నాకు చేరుకోన్నది. ఈ మార్గంలో రైలు కేవలం ఎనిమిది గంటల్లో పాట్నా చేరుకుంది. ఈ రైలును ఉదయం 6 గంటలకు టాటానగర్ నుంచి మొదలై మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాట్నా చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య బయలుదేరి రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య టాటానగర్ చేరనున్నది.
రైలు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం టాటానగర్ – బీహార్ వెళ్లే రైలు పురూలియా, జైచండీ పహాడ్, అసన్సోల్, జేసీదేహ్, క్యుల్ మీదుగా నడుస్తుంది. ఈ సమయంలో అసన్సోల్ స్టేషన్‌లో ఇంజిన్‌ను మార్చాల్సి వస్తుంది. దాంతో చాలా సమయం వృథా అవుతున్నది. ప్రస్తుతం టాటా నుంచి పాట్నాకు రైలు లేదు. రైలు ఉన్నా పాట్నా దాటి వెళ్తుంది. ఈ రైళ్లలో టాటా – బక్సర్ ఎక్స్‌ప్రెస్, దుర్గ్ – అరా సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్, బిలాస్‌పూర్ – పాట్నా సూపర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. టాటా – పాట్నా మధ్య రైలు ప్రయాణికులకు రైలు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే భావిస్తోంది. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నది.